శ్రీరాముడి అరణ్యవాస ప్రాంతం అని చెప్పబడే ఇక్కడ రామకుండ్, సీతాగుహ, లక్ష్మణ రేఖ, పంచవటి పుణ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ పుణ్యస్థలం ఎక్కడ ఉంది? ఎందుకు ఇక్కడ కుంభమేళా ఉత్సవం జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఈ పుణ్యస్థలం ఉంది. గోదావరి నది తీరంలో ఈ పుణ్యక్షేత్రం ఉన్నది. అయితే ఇక్కడే లక్ష్మణుడు రావణుని సోదరికి ముక్కు, చెవులు కొసాడని అందుకే ఈ ప్రాంతానికి నాసికాపురం అని పేరువచ్చి కాలక్రమేణా నాసిక్ గా మారిందని చెబుతారు. నాసిక్ లో పెద్దవి, చిన్నవి అన్ని కలిపి అనేక దేవాలయాలు ఉన్నవి. ఇక ఈ క్షేత్రం విషయానికి వస్తే, ఈ ఆలయం తొమ్మిది శిఖరాలపై నిర్మించబడింది. నవ శిఖరాలపైనా ఆలయం ఉంది కనుక ఈ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు.
ఇది ఇలా ఉంటె, 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. కుంభమేళా ఉత్సవం మొత్తం నాలుగు పుణ్యక్షేత్రాలలో జరుగుతుంది. అవి ఉజ్జయిని, ప్రయాగ్, హరిద్వార్ మరియు నాసిక్ గా చెబుతారు. ఇలా కుంభమేళా ఉత్సవం జరగడానికి కారణం కారణం ఏంటంటే, పూర్వం క్షిర సముద్రం చిలికినప్పుడు లభించిన అమృతబాండం కోసం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు అమృత కుంభాన్ని పట్టుకొని పరుగెత్తుతూ హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగు చోట్ల దింపారు. ఆ సమయంలో అమృత బిందువులు గోదావరిలో పడ్డాయి. ఆ బిందువులను సేకరించడానికి ఈ ఉత్సవం ప్రారంభించారు.
అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభ ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో గోదావరి నది స్వచంగా, పవిత్రంగా ఉంటుంది. ఇక కుంభమేళా సమయంలో అన్ని రాష్ట్రాల నుండి నాసిక్ కి వచ్చి పవిత్రమైన గోదావరిలో స్నానము చేస్తారు.
ఇంత పవిత్రం స్థలంగా భావించే నాసిక్ లో, 17 అడుగుల ఎత్తైన ద్వి ముఖ మారుతీ విగ్రహం, రావణుడు సీతను అపహరించిన స్థలం, శూర్పణకు ముక్కు కోసిన స్థలం తపోవన్, ముక్తి ధాం, ఐదు మర్రిచెట్లతో గుహవలె కనిపించే పర్ణశాల పంచవటి, అక్షరధామ్, రామదాసు తపస్సు చేసిన వంటి ప్రదేశాలను మనం దర్శించవచ్చును.