రామాయణంలో సీతాదేవి మాయలేడిని చూసి అది కావాలని అడుగగా ఆ మాయలేడి కోసం వేటాడుతూ వచ్చిన ప్రదేశం ఇదేనని స్థలం పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రాన్ని లేడి బండ అని కూడా అంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, లింగాల ఘనపూర్ మండలం, జనగాం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ‘జీడికల్’ అనే గ్రామము కలదు. ఇచట 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రాయి మీద రెండు నీటి గుంటలు ఉన్నవి. అందులో ఒకటి పాలగుండం కాగా రెండవది జీడీ గుండం. అందుకే ఈ క్షేత్రం జీడికల్లుగా పిలవబడుతున్నది. ఇంకా ఈ క్షేత్రాన్ని లేడిబండ అని కూడా పిలుస్తారు.
ఈ గ్రామం నందు విరాచలము అనే కొండ ఉన్నది. ఈ కొండపైన శ్రీరామచంద్రుని ఆలయం ఉన్నది. ఇది చాల పురాతనమైన ఆలయముగా స్థానికులు చెపుతారు. ఈ ఆలయం నందు శ్రీరాముడు స్వయంభువుగా వెలిశాడని ప్రసిద్ధి. వీరుడు అను ముని ఇచట తపస్సు చేస్తూ శ్రీరాముని పూజిస్తూ అతని అనుగ్రహం పొందినందువల్ల ఈ క్షేత్రం విరచలంగా పిలవబడుతున్నది. ఇచ్చట పద్మాసనంలో వెలసియున్న స్వామివారిని విరాచల రామచంద్రుడు అని అంటారు.
ఇక పురాణం విషయానికి వస్తే, సీత కోరిక మేరకు శ్రీరాముడు మాయలేడిని వేటాడుతూ ఈ ప్రాంతాన్ని సందర్శించాడని స్థలపురాణం. లేడి అడుగు జాడలు, శ్రీరాముని పాదాల ముద్రిలు, బాణం సంధించే సమయంలో రాముని మోకాలి ముద్ర ‘లేడిబండ’ పైన ఇప్పటికి స్పష్టంగా కనబడుతుంటాయి.
ఈ క్షేత్రం నందు గాలి, వెలుతురు, వర్షం నేరుగా స్వామివారిని తాకే విధంగా ఆలయం పునర్నిర్మించబడింది. ఇచట మూలవిరాట్టు అయినా శ్రీరామచంద్రస్వాముల వార్లు ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారికి ముందుభాగం రామగుండం కలదు.
ఇక్కడ విశేషం ఏంటంటే, సీతారాములకు సంవత్సరంలో రెండుసార్లు అనగా శ్రీరామనవమి మరియు కార్తీకమాసంలో కళ్యాణం జరగటం విశేషం. అంతేకాకుండా కార్తీకమాసం నందు పౌర్ణమి నుంచి ఏకాదశి వరకు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.
ఈవిధంగా రాముడు మాయలేడి కోసం వేటాడుతూ వచ్చిన ఈ ప్రదేశంలోని ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు.