ఆంజనేయుడు అంటే ధైర్యవంతుడు, బలవంతుడు. మనలో చాలా మంది ఆంజనేయస్వామి భక్తులే ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయస్వామి గుడి అనేది తప్పకుండ ఉంటుంది. అయితే ఈ ఆలయంలో స్వామివారి అర్చన విషయంలో ఒక సంప్రదాయం అనేది పురాతన కాలం నుండి కూడా ఉంది. మరి ఆ సంప్రదాయం ఏంటి? ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, ఇటిక్యాల మండలంలో, బీచుపల్లి అనే గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారు ఆలయం ఉంది. ఇది అతి పురాతన ఆలయముగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొలువైన ఆంజనేయస్వామి వారిని బీచుపల్లి రాయుడు అని కొందరు భక్తులు పిలుస్తుంటారు.
ఇక ఆలయ పురాణానికి వస్తే శ్రీ కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల వారు తమ శిష్య బృందంతో దేశపర్యటన చేస్తూ ఆ బీచుపల్లి గ్రామా సమీపంలోని కృష్ణానది ఒడ్డున స్నామాచరించి తన వస్త్రములను శుబ్రము చేయమని ఒక శిష్యునికి ఇవ్వగా, ఆ శిష్యుడు ఒక రాతి పైన బట్టలు ఉతుకుచుండగా నేను ఆంజనేయస్వామి అని మాటలు వినిపించాయి. అంతటా ఆ శిష్యుడు బయపడి వెంటనే గురువుకి చెప్పగా అప్పుడు వ్యాసరాయలవారు దగ్గరికి వచ్చి చూడగా మరల అవే మాటలు రాతి నుండి వచ్చాయి. అప్పుడు అయన ఆ రాతిని తిప్పి చూడగా ఆంజనేయస్వామి దర్శనం ఇచ్చాడు.
అప్పుడు స్వామి అదృశ్యరూపంలో తనను ప్రతిష్టించాలని వారిని కోరగా, ఆ వ్యాసరాయులవారు మీరు బరువు బరువు తగ్గాలని అంత బరువు ఉన్న విగ్రహం మేము మోయలేము అని విన్నవించుకోగా, అప్పుడు ఆ దేవుడి దానికి ఒప్పుకొని బరువు తగ్గగా, ఎక్కడైతే నేను బరువు ఎక్కువ అవుతానో అక్కడ నా విగ్రహాన్ని ప్రతిష్టించండి అని చెప్పాడు. ఇలా వ్యాసరాయలవారు తన శిష్యులతో కలసి విగ్రహాన్ని తీసుకు వెళుతుండగా ఈ బీచుపల్లి గ్రామంలో ఓ రావి చెట్టు కిందకి రాగానే విగ్రహం బరువెక్కగా వ్యాసరాయులవారు ఆ రావి చెట్టు కింద ప్రతిష్టించారు.
ఇక ఆయన తన ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. రేపు వెళ్లాలనుకొన్నప్పుడు ఆయనకు ఆందోళన వేసింది. తాను వెళ్లిపోతే ఈ విగ్రహానికి పూజ ఎలా అనే ప్రశ్న ఆయనను వేధించింది. రాత్రి ఆంజనేయస్వామి కలలో కనిపించి రేపు ఉదయం విగ్రహానికి ఎవరు మొదటి పూజ జరుపుతారో వారే ఆలయ అర్చకత్వం వహిస్తారని చెప్పాడు. వ్యాసరాయలు ఉదయం లేవగానే ఒక బాలుడు విగ్రహాన్ని పూజిస్తున్నట్లు కనుగొన్నాడు.
అప్పుడు రాయలు రెండవ ఆలోచన లేకుండా బీచుపల్లి అనే పేరు కలిగిన ఆ బాలునికి విగ్రహపూజ బాధ్యత అప్పగించాడు. ఆ బాలుడు బోయ కులస్థుడు. దీనితో ఆ రోజు నుండి నేటి వరకు బోయకులం వారే ఆంజనేయస్వామికి పూజలు జరుపుతున్నారు. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ శివాలయం నిర్మించబడింది. ఇటీవలి కాలంలో శ్రీరామాలయం నిర్మాణం జరిగింది. ఈవిధంగా ఆంజనేయుడిని మొదటగా పూజించి అర్చకుడు అయినా ఆ బాలుని పేరే ఈ గ్రామానికి బీచుపల్లి అని పెట్టారని చెబుతారు.