తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. మరి తిరుమల శ్రీవారికి రోజు జరిగే పూజల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు స్వామివారికి మొదటగా చేసే సేవ సుప్రభాత సేవ. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలువుతుంది. ఈ సేవ తరువాత ఉదయం 3 నుండి 4 గంటల మధ్య ఆలయ శుద్ధి జరుగుతుంది.
స్వామివారికి పూలమాలలతో అలంకరిస్తారు. దీనినే తోమాలసేవ అని అంటారు. ఆలయ శుద్ధి తరువాత వారంలో ఆరు రోజులు ఈ సేవ జరిపిస్తారు. ఇక ప్రతి శుక్రవారం రోజున మాత్రం అభిషేకం చేసిన తరువాత మరల తోమాలసేవ చేస్తారు. ఈ సేవ అనంతరం స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది.
ఉదయం 4.45 నుండి 5.30 వరకు శ్రీవారి 1008 నామాలను స్తుతిస్తూ తులసి దళాలతో అర్చన చేస్తారు. ఇలా చేసే అర్చనని సహస్రనామార్చన అని అంటారు. ప్రతి రోజు ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు. ఇదే స్వామివారికి సమర్పించే మొదటినైవేద్యం. ఇందులో నేతి పొంగలి, చక్కర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్యోజనం, మాత్రాన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు.
ఇక మధ్యాహ్నం అష్టోత్తర శతనామార్చన మొదలవుతుంది. ఆ తరువాత ఈ పూజ సమయంలోనే రెండవ గంట మోగుతుంది. అప్పుడు స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్యోజనం, తెల్ల అన్నం, చక్కర అన్నం, గుడాన్నాం సమర్పిస్తారు. స్వామివారికి సమర్పించే ఈ నైవేద్యాన్ని రాజభోగం అని అంటారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు. ఆ తరువాత రాత్రి కైంకర్యాలు జరుగుతాయి. స్వామివారికి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. ఇందులో మిర్యాల అన్నం, వడ, లడ్డు, శాకాన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం సమర్పిస్తారు.
స్వామివారికి రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవని ఏకాంత సేవ అని అంటారు. ఆ తరువాత ముత్యాలహారతి ఇస్తారు. ఇక రాత్రి రెండు గంటలకి గుడిని మూసివేస్తారు. ఈవిధంగా తిరుమల స్వామివారికి ప్రతి రోజు ఉదయం సుప్రభాత సేవ దగ్గరి నుండి రాత్రి స్వామివారి ఏకాంతసేవ వరకు పూజలను నిర్వహిస్తారు.