భారతదేశంలోని ఏడు వింతల్లో ఒక వింత కోణార్క్ లోని ఈ సూర్యదేవాలయం. మరి వింతగా అనిపించేలా ఈ ఆలయ నిర్మాణంలో ఏముంది? ఈ ఆలయానికి గల స్థల పురాణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఒడిశా రాష్ట్రము పూరి నుండి 35 కి.మీ దూరంలో కోణార్క్ క్షేత్రం కలదు. ప్రపంచ ప్రసిద్ధిపొందిన కట్టడాలలో కోణార్క్ లోని సూర్యదేవాలయం ఒకటి. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షత ప్రదేశం. ఈ కోణార్క్ ని పద్మక్షేత్రం అంటారు. అయితే సముద్రతీరాన ఉన్న కోణార్క్ సూర్యదేవాలయం నల్ల గ్రానైటు రాళ్లతో 13 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలియుచున్నది. దీన్ని తూర్పుగంగ వంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించాడు.
సూర్యభగవానుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిలాపాలతో, స్త్రీ మూర్తుల అధ్బుత భంగిమలతో కూడి హృద్యంగా అలంకరింపబడి ఉన్నది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడూ బలమైన అశ్వాలు,12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించుటకు అప్పట్లో 12 సంవంత్సరాల సమయం పట్టిందని చెప్పుతారు. సూర్యగమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం ఆధ్బుతాలలో కెల్లా అధ్బుతంగా చెప్పవచ్చును. రథానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాశులు వీటి అనుగుణంగా సూర్యగమనం చాటిచెప్పే విధంగా ఈ ఆలయం నిర్మించారు.
ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, శ్రీకృషునికి జాంబవతి ద్వారా కలిగిన కుమారుని పేరు సాంబుడు. ఇతను చాలా అందగాడు. ఆ అందమైన రూపం వలన ఆయనికి చాలా గర్వము ఉండేది. ఆ గర్వంతోనే ఒకసారి నారద మహర్షిని అవమానపర్చగా, నారదుడు తెలివిగా సాంబుని అంతఃపుర స్త్రీలు స్నానం చేసే ప్రదేశానికి తీసుకెళ్లగా, అక్కడ కూడా సాంబుడు అసభ్యంగా ప్రవర్తించాడట. ఆ విషయం తెలిసిన కృష్ణుడు ఆగ్రహానికి గురై సాంబుని కుష్ఠివాడైపో అని శపించాడు. అప్పుడు విచారించి సాంబుడు నివారణోపాయాన్ని చెప్పమని కోరగా, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం సాంబుడు ఈ అర్కక్షేత్త్రానికి వచ్చి ఒక కుటీరం నిర్మించుకొని ఈ క్షేత్రంలో ప్రవహిస్తున్న చంద్రభాగా నదిలో నిత్యం స్నానం చేసి సూర్యుడిని ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు.
ఒకరోజు సాంబునికి ఈ నది నీటిలో సూర్యుని విగ్రహం ఒకటి దొరికింది. ఆ విగ్రహం తీసుకువచ్చి ప్రస్తుతం కోణార్క్ ఆలయం ఉన్న చోట ప్రతిష్టించి ప్రతిరోజు నిష్టగా పూజిస్తూ ఉండగా కొంతకాలానికి కుష్టి వ్యాధి నుంచి విముక్తుడయ్యాడంటారు.
ఇది ఇలా ఉంటె ఒకప్పుడు సూర్యభగవానుడు అర్కుడు అనే రాక్షసుని ఈ ప్రదేశంలో సంహరించాడు కనుక ఈ ఉరికి ఆ పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం అయితే, ఒడిశా రాష్ట్రంలో మొత్తం అయిదు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయని అందులో దిశలో కోణంలో సూర్యుడు వెలిశాడని అందుకే కోణార్క్ అయిందని మరి కొందరి అభిప్రాయం. ప్రస్తుతం అయితే ఈ ఆలయ గోడల యొక్క బయటి భాగం మాత్రమే చూడగలము. ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లే మార్గం పూర్తిగా మూసివేశారు. ఆ గర్బగుడిలోనే ఏడు గుర్రాలు ఉన్న రథం మధ్య సూర్యభగవానుని విగ్రహం ఉండేదట. ప్రస్తుతం కనిపించే కట్టడం 192 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడి సముద్ర తీరా ఇసుక బంగారపు వర్ణంలో ఉంది తీరా ప్రాంతం అందాలు చిందుతూ ఉల్లాసం కలిగిస్తుంది.
ఇంతటి చరిత్ర మరియు అధ్బుతమైన కట్టడ శిల్ప సౌందర్యం ఉన్నందు వలనే ఈ కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు.