మనలో చాలామందికి అల్లమప్రభు అంటే తెలిసిఉండకపోవచ్చు. అయన 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలో అంటరానితనంపైన పోరాడి సమాజంలో మార్పుని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశసంచారం చేస్తూ ఎన్నో శివాలయాలని దర్శించి ఆత్మలింగాన్ని పొందిన మహా శక్తిమంతుడు. మరి అయన పొందిన ఆ లింగం ఎక్కడ ఉంది? అయన దేశసంచారం ఎందుకు చేసాడు? రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఒక సాధువుని అయన ఎలా ఆచ్చర్యపరిచాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లమప్రభు 12 వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. ఈయన గొప్ప శివభక్తుడు. ఒక గొప్ప ఆధ్యాతిమిక సాధువు. అయితే అయన కమలత అనే ఒక యువతిని వివాహం చేసుకోగా ఆమె తీవ్ర జ్వరంతో మరణించడంతో, అది తట్టుకోలేని ఆయన దేశసంచారం చేస్తూ అనేక శివాలయాలను దర్శించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఒక గురువు ఆత్మలింగాన్ని ఆయనకి ప్రసాదించాడట. ఇది ఇలా ఉంటె, శివనామంతో అన్ని శివాలయాలు దర్శిస్తుండగా అప్పటికే శక్తివంతమైన సాధువుగా అల్లమప్రభు ప్రసిద్ధి చెందగా, ఒక యోగి అల్లమప్రభు ని కలసి అతడితో పోటీ పడాలని భావించాడు. ఆ యోగి వయసు 200 సంవత్సరాల ఉండగా, ఆయన కఠోర సాధనతో పంచభూతాలపైనా ఆధిపత్యం సాధించి శరీరాన్ని దృఢపరుచుకొని వయసుని అధిగమించాడు. ఇలా వయసుని అధిగమించాననే గర్వం ఆ యోగికి ఉంది. అయితే ఆ యోగి ఒక నది ఒడ్డున అల్లమప్రభు ని కలుసుకొని నేను అసలైన యోగిని కావాలంటే ఒక కత్తి తీసుకొని నా నెత్తి పైన కొట్టమని చెప్పగా, అప్పుడు అల్లమప్రభువు ఒక కత్తితో ఆ యోగి తలపైన కొట్టడంతో ఒక రాయికి తగిలినట్టు ఆ కత్తి మళ్ళి వెనుకకు వచ్చింది.
అప్పుడు ఆ యోగి నన్ను ఏ కత్తి కూడా ఏమి చేయలేదు, నేను అమరుడను అని చెప్పి, నీవు ఏం చేయగలవు అని అడగడంతో, అల్లమప్రభు నవ్వుతు నువ్వు కూడా నీ కత్తితో నా తలపైన ప్రయోగించి చూడు అనగా, ఆ యోగికి అల్లమప్రభు దృడంగా కాకుండా సామాన్యంగా కనిపించడంతో ఆగిపోగా, అల్లమప్రభు ఏమి పర్వాలేదు కత్తిని నా పైన ప్రయోగించు అనడంతో, ఆ యోగి కత్తితో తలపైన కొట్టగా, ఆ కత్తి అల్లమప్రభువు శరీరం మధ్యనుండి ఏదో గాలిలో వెళ్లినట్టు గా వెళ్లి భూమికి తాకడంతో ఆ యోగి అలానే కత్తితో పాటు కిందపడిపోయాడు. అప్పడు ఆ యోగి ఇది ఏమిటి అని అల్లమప్రభు ని అడగగా, ఇది ఇదో అది కాదు ఇది శివుడు, ఇది ఏదైతే లేదో అది అని ఆ యోగికి సమాధానం ఇచ్చాడు.
ఇక అల్లమప్రభు సంపాదించినా ఆ లింగాన్ని తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బొమ్మన్ దేవ్ పల్లి దగ్గరలో ఉన్న ఒక దట్టమైన కొండపైన ప్రతిష్టించి పూజలు చేసాడు. అందుకే ఈ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ లింగాన్ని దర్శించాలంటే అడవి మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇలా దట్టమైన అడవిలో అల్లమప్రభు కొండపైన ఉన్న ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అన్ని సమస్యలు తొలగి, కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.