Contributed By: Dinakar
ఎండిపోయిన గడ్డిపోచ ఆర్తనాధం,
ఉరికొయ్య మీద వేలాడుతున్న వీరుడు తల, యుద్ధభూమిలో కాలువలు కట్టిన యోధుడి నెత్తురు, వేశ్యాగృహంలో తిరుగుబాటుకి సిద్ధమైన ఆడదాని పిడికిలి ఇవే ఆయన కవిత్వానికి ముడిసరుకులు.
అప్పులుతో ఉరిపోసుకున్న వ్యవసాయం,
నిరుద్యోగంతో విషం మింగిన డిగ్రీలు,
విప్లవంలో గొంతు తెగిన ఎర్రజెండాలు, ఇంకా ఎన్నెన్నో…శ్వాస తీసుకుంటూ చదవండి మీకు తెలియకుండానే మీ శృతిమించి వేగం అంతకంతకు పెరిగిపోతూ ఊపిరి అందని సంఘటనలు జరగవచ్చు.
జాగ్రత్త పడండి, మీ చుట్టూ జనసంచారం లేకుండా… ఉన్నట్లుండి పొలికేకలు, పెడబోబ్బులు, వికటాట్టహాసలు చేయాల్సివస్తుంది. ఆది అంతం లేని ప్రదేశాలు ఎంచుకోండి, కుదిరితే సముద్రతీరంలోనో, సుదీర్ఘ ప్రయాణంలోనో ఈ పుస్తకం తెరవడానికి పూనుకోండి. ఒక నిర్దిష్ట స్థలంలో మాత్రం మీపాదాలు, మనసు నిలుపుకోవడం కుదరదు కాబట్టి. నిప్పులు చిమ్మే కవిత్వం కోసం, సలసలకాగిన పదాల కోసం, నెత్తుటిలో ముంచి తీయబడిన భావాల కోసం. నిగంటువులలో, ప్రభందాలలో వెతకొద్దు.
“మహాప్రస్థానం” పుస్తకం పేజీలు తిప్పండి. అరవై కవిత్వాల సంపుటి, దశాబ్దాల వేదన, ఒక శతాబ్దానికి దాఖలా.