హిందూ సంప్రదాయంలో దేవాలయ దర్శనం చాలా ప్రాశస్త్యం.. . పెళ్ళైన వారు దంపతులు తమ కాపురంలో ఏ కలతలు రానివ్వకూడదని దగ్గర్లోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా వ్రతాలు, హోమాలు చేసే సమయంలో భార్య, భర్త అంటే దంపతులు ఇరువురూ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా ప్రతి శుభ కార్యంలో భార్యభర్తలు జంటగా పూజలు చేస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా దేశంలో ఒకే ఒక చోట మాత్రం ఓ దేవాలయానికి జంటగా దంపతులు వెళ్లకూడదు. భర్త దేవాలయం బయట ఉంటే, భార్య దేవాలయంలోకి వెళ్లి మూలవిరాట్టును దర్శనం చేసుకుని రావాలి. అటు పై భర్త వంతు వస్తుంది. ఇటువంటి దేవాలయం ఎక్కడ ఉంది, దాని వెనుక ఉన్న కథ ఏమిటన్న విషయం ఇపుడు తెలుసుకుందాం..
శిమ్లాకు దగ్గరగా ఉన్న రామ్ పూర్ అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయం ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది దుర్గామాత రూపంలో ఉన్న పార్వతి దేవి. ఇక్కడ దంపతులు జంటగా దేవాలయంలోకి ప్రవేశించడాన్ని నిషేదించారు. దుర్గామతా దర్శనానికి ఇద్దరూ వేర్వేరుగా వెళ్లాలి. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం నడుచుకుంటూ వస్తోంది. ఈ సంప్రదాయాన్ని స్థానికులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు ఎవ్వరూ అతిక్రమించరు..
ఇక్కడి దేవతను శ్రాయ్ లేదా ష్రాయ్ కోట మాత పేరుతో భక్తులు కొలుస్తారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ప్రతి పల్లె, పట్టణం ప్రాంతాల్లోని ప్రజలకు ఈ దేవాలయం గురించి తెలుసు. ఇక్కడ దంపతులు ఇద్దరు జంటగా ఎట్టిపరిస్థితుల్లోనూ దైవ దర్శనం చేసుకోరు. ఒకవేళ దీనిని నమ్మని వారు ఎవరైనా జంటగా దైవ దర్శనం చేసుకుంటే వారి మధ్య మనస్పర్థలు వచ్చి ఖచ్చితంగా ఒకరికొకరు దూరమవుతారని చెబుతారు. అందువల్లే ఈక్కడ ఎవరకూ జంటగా గుడిలోకి వెళ్లరు..
పూర్వ కాలంగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. శివ గణానికి అధిపతిని నిర్ణయించడం కోసం పార్వతి, పరమేశ్వరుడు తమ ఇద్దరు పుత్రులైన గణపతి, కుమారస్వామికి పరీక్ష్ పెట్టాలనుకుంటారు. ఇందు కోసం ఎవరు ఈ మూడు లోకాలను మూడు సార్లు చుట్టి వస్తారో వారిని అధిపతిగా నిర్ణయిస్తామని చెబుతారు. విషయం తెలిసిన వెంటనే కుమారస్వామి తన మయూర వాహనంతో మూడు లోకాలను చుట్టి రావడానికి బయలుదేరుతాడు.
సూక్ష్మబుద్ధి కలిగిన వినాయకుడు ఇందులోని అంతరాన్ని గురించి ఆలోచిస్తాడు. అటు పై పార్వతి పరమేశ్వరులకు పాదపూజ చేసి వారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి అక్కడే కుర్చొండిపోతాడు. ఇక కుమారస్వామి ఎక్కడకు వెళ్లినా ఆయన అక్కడకు చేరుకోవడానికి ముందే వినాయకుడు ఆ ప్రాంతంలో ఉన్నట్లు కనిపిస్తాడు. దీంతో చివరికి చేసేది ఏమీలేక పరీక్ష మొదలైన చోటకి కుమారస్వామి అత్యంత ఆశ్చర్యంతో చేరుకుంటారు. కుమారస్వామి రావడానికి ముందే వినాయకుడికి పార్వతీ, పరమేశ్వరులు అందరి దేవతల సమక్షంలో పెళ్లి చేస్తారు. ఇక కుమారస్వామి ఈ విషయం తెలుసుకుని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా మిక్కిలి బాధపడి తన కంటే అన్నింటిలో వినాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ దేవతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాను ఇక పై పెళ్లి చేసుకోనని ప్రకటిస్తారు. దీంతో అటు పార్వతి పరమేశ్వరులతో పాటు దేవతలు మిక్కిలి ఆశ్చర్యపోతారు.
కుమారస్వామి విచక్షణను కోల్పోయి ఎందుకు ఇలా ప్రవర్తించడని పార్వతి దేవి యోగమాయతో చూస్తుంది. కుమారస్వామి నిలబడిన స్థల ప్రభావం వల్ల ఈ విధంగా జరిగిందని తెలుసుకుంటుంది. దీంతో పార్వతి దేవి తన కుమారుడికే విచక్షణను కోల్పోయేలా చేసిన ఈ ప్రాంతాన్ని సాధారణ మానవులు ముఖ్యంగా దంపతులు చేరుకుంటే వారి జీవనంలో జరగ కూడని ఎన్నో సంఘటనలు జరిగి అశాంతికి కారణమవుతుందని కూడా ఆ మహామాత కు అవగతమవుతుంది. దీంతో సదరు ప్రాంతంలో తాను శ్రాయ్ కోట మాతగా వెలుస్తానని దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ జంటగా ఇక్కడకు రాకూడదని చెబుతుంది. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఆ దంపతుల మధ్య కలహాలు చెలరేగి వెంటనే వారు విడిపోతారని శాపం పెడుతుందని ఇక్కడి పూజరులు చెబుతారు. అందువల్లే ఇక్కడకు వచ్చే దంపతుల్లో మొదట ఒకరు అటు పై మరొకరు ఈ దేవతను దర్శించుకుంటారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ జంటగా మాత్రం దేవతను పూజించరు.