సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని ఎందుకు భావిస్తారు?

ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి. అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు.

Lalita Sahasranamaఅమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలో అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి ‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు.

Lalita Sahasranamaలలితాసహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టిస్థితిలయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి.

Lalita Sahasranamaచాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.లలితాసహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తోంది.

Lalita Sahasranamaలలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్‌, అంగన్యాసమ్‌, కరన్యాసమ్‌, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది. ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి.

అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు.

Lalita Sahasranamaలలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైనవారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృస్టిరహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR