సరైన ఆహారం లేకుంటే కొన్ని రోజులైనా బ్రతకగలం కానీ సరిపడా నిద్ర లేకుంటే మాత్రం రెండురోజులు కూడా ఉండలేరు. అది నిద్రకు ఉన్న ప్రాముఖ్యత. నిద్ర ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. రాత్రి హాయిగా నిద్రపోతే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
అదే నిద్ర సరిగా లేకుంటే అందరిని విసుక్కుంటూ ఇతరులపై అరుస్తూ గొడవలకు దిగే అవకాశం ఉంది. రాత్రుల నిద్రపోకుండా మేల్కుంటే.. ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు. రోజుకు 8 గంటలపాటు నిద్రపోకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే కొంతమంది పడక ఎక్కి అటుఇటు ఎంత దొర్లినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. కానీ కొంతమంది మాత్రం బెడ్ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. అయితే అదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బెడ్ మీద వాలగానే గాఢ నిద్రలోకి జారిపోతే మంచిదేగా అనుకుంటారు కానీ వెంటనే నిద్రపోయే వారికన్నా కాస్త సమయం తీసుకొని నిద్రపట్టేవారే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే పడుకోగానే వెంటనే నిద్ర పడితే వారికి నిద్ర సరిపోకపోవడమే కారణమట. అదే నిద్ర సరిపోతే మరలా నిద్రలోకి జారుకోవడానికి కాస్త టైం పడుతుంది. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు.
వెంటనే నిద్రలోకి జారుకునేవారు ఇంకాస్త టైం నిద్రకు కేటాయించాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. రోజూ సరిగా నిద్రపోతున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా నిద్రకు మాత్రం 8 గంటలు కేటాయించాలి. అప్పుడే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది