హిందూ సంప్రదాయానికి అక్షింతలకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి శుభకార్యంలోనూ తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించడం సాంప్రదాయం. మన సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకూ అంతే ప్రాధాన్యం ఉంది.
బారసాలయినా, అన్నప్రాశన అయినా, పెళ్లయినా, పేరంటమైనా చివర్లో పెద్దలు నాలుగు అక్షింతలు చల్లుతారు. అక్షింతలు తయారు చేసి మంత్రాలు చదువుతూ, అర్చకులు, గురువులు పిల్లలకు ఆశీర్వచనాలు అందజేస్తారు. అసలు ఎందుకు అలా చేస్తారు? ఆ అక్షింతల వలన ఏమిటి ఉపయోగం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్షింతలు అంటే క్షయం కానివీ పరిపూర్ణమైనవీ అని అర్థం. విరిగిపోని మంచి ధాన్యాన్ని ఎంచుకొని, పొట్టుతీసి, పసుపు, ఆవునెయ్యి కలిపి అక్షింతలు తయారుచేస్తారు. ఇందులో బియ్యాన్ని చంద్రుడికి ప్రతీకగా చెబుతారు. ‘మనః కారకో ఇతి చంద్రః’ అంటే చంద్రుడు మనసుకి కారకుడు లేదా అధిపతి అని అర్థం.
మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తాం. అంతే కాదు బియ్యంలో కలిపే పసుపు గురువుకు ప్రతీక. గురు గ్రహం శుభ గ్రహం. అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
పసుపు యాంటీ బయాటిక్, నెయ్యిలోనూ దివ్యమైన ఔషదగుణాలు ఉన్నాయి. భక్తితో కూడిన ఆరోగ్యాన్ని మనకందించడానికి మన పెద్దలు ఇలాంటి ఎన్నో మార్గాలను మనకు చూపారు.