విష్ణు దేవాలయాలకు వెళ్తే మనకు తులసి మాలలు కనిపిస్తాయి. దేవుడి మెడలోని తులసి మాలలు తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కడతారు.తీర్థం లోను తులసి ఆకులూ వేస్తారు. ఇంత పవిత్రమైన తులసి గురించి తెలుసుకుందాం. మూలికలలో మహారాణి తులసి. తులసి అనే సంస్కృత పదం. తులసి అంటే సాటిలేనిది అని అర్థం. “యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ ” అని శాస్త్రాల్లో చెప్పబడింది.
తులసి మొక్క మధ్య భాగంలో అంటే కాండం నుంచి సమస్త దేవీదేవతలు అగ్రభాగమందు నాల్గువేదాలు, మూలస్థానమందు సర్వతీర్థాలు నివాసముంటాయి. అటువంటి తులసికి నమస్కరిస్తున్నానన్నదే ఈ శ్లోకం అర్థం.
మన జీవన విధానానికి ప్రకృతి ఆలంబన. ప్రకృతిలో ముడిపడి సాగే జీవనసరళిలోని పురాణగాథలలో అంతర్లీనంగా ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. పురాణగాథలో ముడిపడిన జీవనశైలిలోని ఆచార వ్యవహారాలన్నీ మానవ జీవన వికాసానికి తోడ్పడతాయి.
తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసి, లక్ష్మితులసితో పాటు రామతులసి, అడవితులసి, నేలతులసి, మరువకతులసి, రుద్రజడతులసి, కర్పూరతులసి ఇలా ఎన్నో రకాలున్నాయి. కర్పూరతులసి తైలాన్ని ఓషధీయుత టాయ్‌లెట్స్ సాధనాల తయారీలో విరివిగా వాడతారు. ఈ నూనెను చెవినొప్పికి, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎక్కువగా వాడతారు.
శ్వాస అవరోధ రుగ్మతలను నయం చేయడానికి రామతులసిని ముందుగా వాడతారు. మలేరియాను రామతులసి నయం చేస్తుంది. అజీర్ణం, తలనొప్పి, హిస్టీరియా, నిద్రలేమి, కలరా వంటివి నయం చేయడానికి తులసిలో మందు ఉంది. రుగ్మతల్ని నయం చేసే గుణాలుగల తులసి మూలికల్లో మహారాణిగా శతబ్దాల తరబడి ప్రసిద్ధి గాంచినది.