సకల జీవరాసులకు మంచి చైతన్యం ఎవరిచేత అయితే కలుగుతుందో అతడే సూర్యుడు, అని సూర్యశబ్దాలు రచించబడ్డాయి. అంటే.. ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని దీనికి అర్థం. అతని వల్లే ఈ సృష్టి జరిగి, పోషించబడుతోంది.
సూర్యుడు తన కిరణాలవల్ల తపింపచేస్తూ భూమ్మీద నీటిని ఆకర్షించి, నీటి మేఘాలలో నిలుపుతాడు. అప్పుడా మేఘాలు వర్షిస్తాయి. వర్షంచేత సస్యములు, వృక్షాలు మొలుస్తాయి, వాటివల్ల ఆహారం ఏర్పడుతుంది. ఆహారం నుంచే సమస్తప్రాణులు పుడతారు. కాబట్టి ప్రాణసృష్టికి మూలమైనవాడు సూర్యుడే అతడే పరతత్త్వము. ఇక్కడ వరకు సూర్యుని గురించి అందరికి తెలిసిన విషయమే.
అయితే సూర్యునికి మార్తాండుడు అని పేరు ఎవరు పెట్టారో తెలుసుకుందాం. అదితి తన గర్భంలో సూర్యభగవానుడు జన్మించవలసిందిగా కోరి సూర్యారాధనం చేస్తుంది. కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితికి గర్భం కలుగుతుంది. అదితి ఉపవాసం, వ్రతాలతో చిక్కిపోవడం చూసి ఒకరోజు కశ్యపుడు కోపగించుకుని ‘‘ఇంత తపంచేసి చివరికి గర్భం పోగొట్టుకున్నావ్ ఎందుకు?’? అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు అదితి భర్త తనను పరిహానం చేస్తున్నాడని కోపంతో ‘‘ఈ గర్భం జారిపోతే పిండం నుండి జన్మించి లోకాలను సంరక్షించేలా వుండు’’ అని గర్భానుండి అండాన్ని జారవిడుస్తుంది. అది మహాతేజస్సుతో భూమిమీద పడుతుంది. మొదట అది మృతప్రాయమైనట్లు కనబడుతుంది. తరువాత వేయి సువర్ణకాంతులతో ఒక బాలుడు దాని నుంచి ఉదయిస్తాడు. అప్పుడు అదితి ‘‘నాథా! నువ్వు అండాన్ని చంపేసావా అని అడిగావు. అతడే ఇప్పుడు కొడుకుగా పుట్టాడు. కాబట్టి ఇతడు ‘మార్తండుడు’గా పిలవబడతాడు’ అని చెబుతుంది.