శీతాకాలం వచ్చిందంటే కొన్ని సమస్యలు మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. అందులో ప్రధానంగా చర్మసమస్యలు ఒకింత ఎక్కువవుతాయి. అలాంటివాటిల్లో చుండ్రు ఒకటి. అటు జుట్టులోనూ, ఇటు మాడుపైనా మాటిమాటికీ దురద పుట్టిస్తూ, నలుగురిలో ఇబ్బంది కలిగిస్తుందీ సమస్య. అన్ని కాలాల్లో కంటే ఈ సీజన్‌లో ఎక్కువయ్యే ఈ చుండ్రుకు కారణాలేమిటో, దాన్ని నివారించడం ఎలాగో తెలుసుకుందాం.
కొందరు తలదువ్వుకోగానే దువ్వెనలో తెల్లటి పొలుసులు రాలుతాయి. మరికొందరిలో ఇవే పొలుసులు షర్ట్‌పై పడి అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడానికి కారణమేమిటో చూద్దాం. చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పైన ఎపిడెర్మిస్, కింది డెర్మిస్ అనే పొరలుంటే అందులోని డెర్మిస్‌లోకి హెయిర్ ఫాలికిల్స్ అనే రోమాంకురాల్లోంచి వెంట్రుకలు పుట్టుకువస్తాయి. వీటి పక్కనే సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు సీబమ్ అనే నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది వెంట్రుకలను ఆరోగ్యంగానూ, నిగారింపుతో కూడిన మెరుపును కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ సీబమ్ ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరి లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలపైన ఉండే చర్మం ఒకింత జిడ్డుగా మారుతుంది. నివారించే చిట్కాలు తెలుసుకుందాం.
ఆపిల్ సీడర్ వెనిగర్:
ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు.
షాంపూ సరిగా చేసుకోవాలి:
షాంపూ చేసుకున్న తర్వాత సరిపడా నీటితో తలను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా తల మీద నూనె, మృత కణాలు తొలగిపోవు. ఫలితంగా అది డాండ్రఫ్‌కు దారితీస్తుంది. తక్కువ గాఢత ఉండే షాంపూతో తరచుగా తలంటుకోవాలి. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ రాసుకునే అలవాటు ఉంటే.. దాన్ని మాడుకు అంటకుండా చూసుకోండి.
వేపాకు:
వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి. మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెతోనూ డాండ్రఫ్‌ను తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 – 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.
నిమ్మరసం:
తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది. డాండ్రఫ్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి.