శబరిమలై యాత్ర “ఎరుమేలి”తో మొదలవుతుంది. ఎరుమేలిలో “వావరు స్వామి”ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. “నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు” అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు.
ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే). దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో “పేటై తులాల” అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు “పేటై తులాల”). ఈ ఎరుమేలి వద్ద ఉన్న “ధర్మశాస్త” ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను “కన్నెమూల గణపతి” అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. “పెద్ద పాదం” అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు.
ఆ రాతిని “కళిద ముకుంద” (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబా నది చేరుకొంటారు. అక్కడే “పంబ” అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.
చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి. భక్తులు పంబానదిలో స్నానం చేసి “ఇరుముడి”ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో “నీలిమలై” అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో “శరమ్ గుత్తి” అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.