భారత్‌లో ఉన్న 108 వైష్ణవ ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి అనంతశయన భంగిమలో ఆదిశేషుడిపై కనిపిస్తాడు. ప్రపంచం మొత్తం మీద ఉన్న అత్యంత సంపన్న విష్ణు ఆలయాలలో అనంత పద్మనాభ స్వామి ఆలయం మొదటి స్థానంలో ఉంది. తిరుమల క్షేత్రం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ స్వామి దర్శించుకోవాలంటే మూడు ద్వారాల గుండా దర్శించాలి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
అనంత పద్మనాభ స్వామి అనగా నాభి నందు పద్మం కలవాడని అర్ధం. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడుగా వెలసిన పుణ్య క్షేత్రం. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రి. శ. 1568వ సంవత్సరంలో నిర్మించారు. ఆలయ గర్భగుడిలో ప్రధాన దైవం అయిన అనంత పద్మనాభుడు అనంతశయన భంగిమలో దర్శనమిస్తాడు. ఆలయం అతి పురాతనమైన దేవాలయం. ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో తామర పువ్వు, మూడో ద్వారం గుండా చూస్తే పాదాలు కనిపిస్తాయి.
ఈ మధ్య కాలంలో ఇక్కడ దేవాలయంలో కొన్ని గదులను తెరిచారు. దీనితో నేలమాళిగలులో అపారమైన సంపద బయటపడింది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలకు ముందు 1860 లో మూసిన గదులు 1950 లో సీలు వేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 5 నేల మాళిగలు మాత్రమే తెరిచారు. దీనిలో అనంతమైన సంపద బయట పడింది. అందులో నెపోలియన్, రోమ్, మధ్యభారత యుగం, బ్రిటీష్ కాలం నాటి బంగారు నాణేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నాణేలు ఉన్న సంచుల బరువు 800 కిలోల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అందులో కొన్ని బంగారంతో చేసిన కుండలు, కుర్చీలను కూడా కనుగొన్నారు. ఇక 4 బై 3 అడుగుల గల విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. దీన్ని వజ్రాలు ఇతర ఖరీదైన మెటల్స్‌తో తయారు చేశారు. ఈ విగ్రహంను కూర్చోబెట్టేందుకు 28 అడుగుల బంగారు పీఠం ఆ నేలమాళిగలో దొరికింది. ఇంకా విగ్రహంకు తొడిగేందుకు బంగారంతో అలంకరించిన బట్టలు కూడా లభించాయి.
ఇంకా ఆరో గది తెరవాల్సి ఉంది. దీనితో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మరి దశాబ్దకాలంగా వార్తల్లో నిలుస్తున్న ఈ పద్మనాభ స్వామి ఆలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం… ఈ ఆలయంలో ఉన్న విగ్రహం త్రిమూర్తులను సూచిస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు. పద్మనాభ స్వామిని వెతుక్కుంటూ విల్వమంగళతు స్వామియార్ అనే సన్యాసి ప్రపంచాన్ని పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే విష్ణువు 18 అడుగుల మేరా తగ్గి ఆదిశేషుడిపై పడుకున్న భంగిమలో ఉన్నట్లుగా విల్వమంగళతు స్వామియార్‌కు దర్శనం కలిగింది.
ఇదిలా ఉంటే ఆ విగ్రహం కందశరకారతో తయారు అయ్యిందని రాజవంశీయులు చెప్పారు. అంటే మూలికలు, జిగురు పదార్ధాలు, మట్టితో తయారు చేయబడిందని వివరించారు. ముందుగా ఈ ఆలయంను చెక్కతో నిర్మించారు. అనంతరం గ్రానైట్ వినియోగించి నిర్మించారు. ఈ రోజు ఉన్న ఆలయం గ్రానైట్ నిర్మాణంతో ఉన్నదే. ఈ ఆలయంలో 365 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం ఒక్కో రోజును సూచిస్తుంది.
ఇక ఆలయంలోని ప్రధాన విగ్రహం తయారీకోసం 12,500 సాలీగ్రామ రాళ్లను నేపాల్‌లోని గందకీ నది తీరం నుంచి తరలించారు. సాలీగ్రాములు చాలా పవిత్రమైన రాళ్లు. వీటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రాళ్లకు విష్ణువుకు అనుబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి.