శ్రీహరి పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్నికలిగిస్తుంటుంది. ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ సమస్య అనిపించలేదు. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలావుండగా, ఒకరోజున ఆదిశేషునికి శ్రీమహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు. “ఎందుకిలా జరుగుతోంది?” అని ఆదిశేషుడు, అదే విషయాన్ని గురించి శ్రీమహావిష్ణువుతో ప్రస్తావించాడు. అది విన్న విష్ణుమూర్తి “ఆదిశేషా! నిన్న భూలోకానికి వెళ్లాను కదా! అక్కడ ఓ పుణ్య ప్రదేశంలో శివుడు తాండవనృత్యాన్ని చేయడం చూసాను. త్రినేత్రుడి తాండవ నృత్యాన్ని చూసిన నా మనసు సంతోషముతో నిండిపోయింది. అందుకే నా శరీరంకూడ బరువెక్కింద” అని నవ్వుతూ చెప్పాడు.
విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుని మనసులో ఓ చిన్న ఆశ మొదలైంది. ఎలాగైనా తాను కూడా శివతాండవ నృత్యాన్ని చూసి తరించాలి. “నేను కూడా ఆ స్వామి తాండవ నృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి?” అని తన స్వామిని అభ్యర్దించాడు ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు, “ప్రస్తుతం శివ పరమాత్మ తాండవం చేస్తున్నాడు. నువ్విప్పుడు అక్కడకు వెళితే, ఆయన తాండవ నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు” అని చెప్పాడు. చెప్పడమే కాదు, వెంటనే చూసి తరించమని ఆదిశేషునికి తన అనుమతిని కూడా ఇచ్చాడు.
వెంటనే ఆదిశేషుడు మనిషితల, పాము శరీరముతో కూడిన ఓ చంటిబిడ్డ రూపాన్ని ధరించి అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయదేవి చేతులలో పడ్డాడు. మనిషి తల, పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే ఒళ్ళు జలదరించుకున్న అనసూయదేవి, తనచేతులను గట్టిగా విదిలించి, ఆ బిడ్డని దూరంగా విసిరేసింది.
కిందపడిన ఆ బిడ్డ, “తల్లీ! భయపడవద్దు, నేను మీ కుమారుడిని. నన్ను మీరే పెంచాలి” అని చెబుతూ అనసూయదేవి పాదాలపై పడటంతో, ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న అనసూయ ‘పతంజలి’ అని పేరు పెట్టి పెంచుకుంటుంది.
అలా అత్రి మహాముని ఆశ్రమములో పెరిగిన పజంజలి సకల శాస్త్ర కోవిదుడై వెలిగాడు. శివడు చిదంబరములో ఆనందతాండవం చేస్తుంటాడని తెలుసుకున్న పతంజలి, ఒకరోజున తన తల్లిదండ్రుల అనుమతితో శివతాండవాన్ని తిలకించడానికి బయలుదేరాడు. ఆదిశేషుడు పతంజలి రూపాన్ని ధరించడం వెనుక గల అసలు కారణం ఇదే!