మిధిలాపుర రాజైన జనక మహారాజు యాగం చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో దొరికినందుకు ఆమెకు ‘సీత’ అని పేరు పెట్టి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భంలో జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాశం శుక్లపక్షంలో జరిగింది. నేపాల్ లోని జనక్ పురి లో ఆమె దొరికిందని వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది.
కానీ సీతాదేవి జన్మ స్థలం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా పేర్కొంటారు. సీతమ్మ నేపాల్ తూర్పు మాధేశ్లోని జనక్పుర్లో జన్మించిందని కొందరు, బీహార్లోని సితామర్హిలో పుట్టిందని కొందరు పేర్కొంటారు. సితామర్హిలోని సీతా కుండ్ ప్రాంతమే సీతాదేవి జన్మ స్థలమని బలంగా నమ్ముతుంటారు. కంబన్ రాసిన తమిళ రామాయణంలోనూ పొలం దున్నతుండగా దొరికిందని, ఆ ప్రాంతమే బీహార్లోని సీతామర్హి గా పేర్కొన్నారు. భూదేవి పుత్రిక సీతను మిథిల రాజు జనకుడు, అతడి భార్య సునయన దత్తత తీసుకున్నారని వర్ణించారు.
వేదవతి జానకిగా పునర్జన్మించిందని కొందరు పేర్కొన్నారు. శ్రీమహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేస్తోన్న వేదవతిని రావణుడు అపహరించడానికి ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకోడానికి వేదవతి అగ్నిలో దూకింది. వచ్చే జన్మలో తన కారణంగా నీకు మరణం తప్పదని శపిస్తుంది. ఆ వేదవతే సీతగా జన్మించిందని కొందరంటారు.
క్రీస్తు పూర్వం 9 శతాబ్దంలో గుణభద్రుడు రచించిన ఉత్తర పురాణంలో అలకాపురి రాజు అమిత్వేగుని కుమార్తె మణివతి సర్వసంగ పరత్యాగి. సన్యాసినిగా మారిన ఆమె దీక్షను రావణుడు భగ్నం చేస్తాడు. తాను వచ్చే జన్మలో ప్రతీకారం తీర్చుకుంటానని ఆమె శపథం చేస్తుంది. రావణుడు, మండోదరికి మొదటి సంతానంగా మణివతి జన్మించింది.
ఆమెతో మరణం తప్పదని జ్యోతిషులు హెచ్చరించడంతో రావణుడు తన అనుచరులను పిలిచి ఆ శిశువును సంహరించమంటాడు. మణివతిని ఓ పెట్టెలో ఉంచి, మిథిల రాజ్యంలో పాతిపెట్టడంతో పొలం దున్నతున్న రైతులు దాన్ని గుర్తిస్తారు. దీంతో జనకుడు ఆమెను సీతగా పెంచుకున్నాడని కొందరంటారు.