ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఈ నెలంతా ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు. ఇస్లాంను ఆచరించే ప్రతి వ్యక్తి కామ, క్రోధం, అహంకారం, అహింసా వంటి దుర్గుణాలను వదిలేసి భగవంతుడి నామ స్మరణం చేస్తూ శాంతి, సహనంతో జీవితం సాగించాలని పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఇటువంటి పవిత్ర జీవనాన్ని సాగించి, ఆధ్యాత్మిక చింతన రగిల్చేందుకు ఏడాదికి ఒక సారి రంజాన్ నెలలో కఠిన నింబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటిస్తారు.
ఈ మాసం మొత్తం ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం ఉంటుంటారు. అల్లాహ్ స్మరణలో తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఏమైనా సూర్యుడి వచ్చినప్పటి నుండి వెళ్ళిపోయేదాకా ఏమీ తినకుండా కనీసం నీళ్ళు తాగకుండా ఉండడమనేది చిన్న విషయం కాదు. అదీ ఎండాకాలంలో ఈ సారి రంజాన్ నెల ఎండాకాలంలో రావడం వల్ల దాహంతో ఇబ్బందిపడే అవకాశాలుంటాయి. అంతేకాదు.. చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోయి, డీహైడ్రేషన్ కి కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలంలో ఉపవాసం చేయడం చాలా కష్టం. ఎండ వేడికి నీళ్లు కూడా తాగకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది.
వయసు మళ్లినవారు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు, అత్యవసర ప్రయాణాలు సాగించేవారు మాత్రం ఉపవాసాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ వారు ఉపవాసం ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
డయాబెటిస్ ఉండి ఉపవాసం ఉండాలనుకున్నవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య, రక్తంలో చక్కెర నిల్వలు పెరగడం, లేదా తగ్గడం, ఇంకా డీహైడ్రాషన్. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. ఇన్సులిన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ దాన్ని ఒకట్లో మూడు వంతులు తగ్గించాలి. రెండు డోసుల ఇన్సులిన్ కంటే ఎక్కువ తీసుకునేవారు ఉపవాసానికి దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ డయాబెటిస్ ఉండి కూడా ఉపవాసం ఉంటే చెమట ఎక్కువగా వచ్చినపుడు, రక్తంలో చక్కెర నిల్వలు 70 mg/dl కంటే తక్కువకి వెళ్ళినపుడు వెంటనే ఉపవాసం మానేయాలి. పండగ నెల కాబట్టి స్వీట్లు తెలియకుండానే తినేయడం జరుగుతుంది. ఉపవాసం ఉన్నవారు పండగ నెలలో గానీ, పండగ పూట గానీ స్వీట్లకు దాదాపుగా దూరంగా ఉండటమే మంచిది.
గర్భవతులు, చిన్నపిల్లలు, పెద్ద వయసులో ఉన్న పేషెంట్లు, రక్తపీడనం ఎక్కువగా ఉన్న వారు ఉపవాసానికి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. చాలామందికి రోజులో కనీసం రెండు మూడు సార్లైనా కాఫీ, టీ తాగడం అలవాటు. కానీ ఈ రెండింట్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరంలోని నీళ్లు మొత్తం బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
చాలామంది ఉపవాసం మొదలు పెట్టేందుకు ముందు ఎక్కువ సేపు కడుపు నిండా ఉండేందుకు సమోసాలు, పకోడీలు వంటివి తింటుంటారు. ఇఫ్తార్ లో కూడా ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి మీ శరీరం నుంచి నీరు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. వీటి బదులుగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, తర్బూజా, కీర దోస, టొమాటోలు తీసుకోవాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ సమయం పాటు శరీరానికి నీటిని అందిస్తాయి.