రావణుడు సీతను మాత్రమే కాదు అంతకు ముందు కూడా ఎంతో మంది స్త్రీలను అవమానించి వారితో శపించబడ్డాడు.బ్రహ్మ గురించి తపస్సు చేశాడు దశకంఠుడు. మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లెక్కచేయనని, మిగిలిన వారితో చావు లేకుండా తనకు వరమివ్వమని అడిగి, బ్రహ్మనుంచి అలాగే వరం పొందాడు. తాత అయిన సుమాలి సలహా మేరకు, రావణుడు కుబేరుడి దగ్గర నుంచి లంకను వశం చేసుకుంటాడు.
మయుడనేవాడు, తన కూతురు మండోదరిని, రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. మండోదరి-రావణాసురుడికి మొదట ఒక కొడుకు పుట్టాడు. వాడు భూమిమీద పడగానే మేఘాలు గర్జించడం వల్ల అతడి పేరు మేఘనాథుడని పెట్టాడు రావణుడు. రావణుడు ముల్లోకాలను భాదించడం మొదలెట్టాడు. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. సోదరుడు కుబేరుడిని జయించి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. కైలాస గిరి ప్రాంతంలో, నందీశ్వరుడిని కోతితో పోల్చి హేళన చేశాడు. కోతులతో ఓడిపోతావని నందీశ్వరుడు శపించాడు.
కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఒకనాడు విష్ణు మూర్తి కోసం తపస్సు చేస్తున్న వేదవతిని తల వెంట్రుకలు పట్టుకుని లాగుతాడు. గతంలో పార్వతి లాగే వేదవతి కూడా రావణుడిని స్త్రీ నిమిత్తంగా నాశనమవుతావని శపిస్తుంది. అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది.
మరుత్తు అనే రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడకు పోయి, మునులందరినీ చంపి, వారి నెత్తురు తాగి, తృప్తి చెంది అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయోధ్యకు వెళ్లి, అనరణ్యుడిని యుద్ధంలో ఓడించి, అతడి శాపానికీ గురవుతాడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు అనరణ్యుడు. ఇది రావణుడికి నాలుగో శాపం.
నరులను చంపటం ఆతడికి ధర్మం కాదని నారదుడు రావణుడికి బోధించాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, దీర్ఘకాలం బతికేవారని వారిని జయించడం గొప్ప అని అంటాడు. యముడిని యుద్ధంలో జయించమని రావణుడికి దుర్భోధ చేశాడు. రావణుడు యముడిని చంపడానికి వెళ్ళాడు. యమ-రావణ యుద్ధం జరిగింది. ఇరువురు సరిసమానంగా పోరు జరిపారు. రావణుడిపై యమ దండం వేయడానికి సిద్ధ పడ్డాడు యముడు. ఆ పని చేయవద్దని బ్రహ్మ దేవుడు యముడిని వారించాడు. యముడు అదృశ్యమైపోయాడు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురి నచ్చక విడిచి పోయాడు. రావణుడు “నివాత-కవచు” లనే రాక్షసులతో సంది చేసుకున్నాడు. కాలకేయులను జయించి, వరుణ నగరంపై యుద్ధానికి పోయాడు. వరుణ తనయులు రావణుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. గెలుపు తనదే కదా అనుకుంటూ, లంకా నగరానికి బయల్దేరాడు రావణుడు.
పోతూ-పోతూ, దారిలో, బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబికులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. వారిలో నాగ కన్యలు, మనుష్య స్త్రీలు, అసుర కాంతలు, రాక్షస వనితలు, యక్ష సతులు, దానవాంగనలున్నారు. వారిలో పెళ్లి ఐన వారు, కాని వారు కూడా వున్నారు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోలేదు. చెరబడిన స్త్రీలు రావణుడిని శపించారు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలనుకోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.
దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, తాను ఆయనకు వరుసకు కోడలని, తన మీద దయ చూపాలని, ఇతరులు తనను అవమానిస్తే రక్షించాల్సిన వాడు ఇలా చేయడం తగదని, తనను నవ్వుల పాలు చేయవద్దని వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన పనిని భర్త నలకూబరుడి(కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. ఇంకోసారి పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపిస్తాడు.