తెలుగువాడి కల ఫలించింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దొరికింది. ప్రతి తెలుగోడు గర్వంగా తలెత్తుకుని మీసం తిప్పే రోజు రానే వచ్చింది. కాకతీయుల కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. క్రీ.శ. 1213లో గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్లరుద్రుడు ఇసుక పునాదులపై నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో చారిత్రక సంపదగా గుర్తించింది. తెలుగు నేలపై ఈ ఘనత సాధించిన తొలి నిర్మాణమిది. వరంగల్లోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోనే కొలువైన ఈ ప్రఖ్యాత ఆలయం నేడు తాజ్మహల్, ఎర్రకోట వంటి కట్టడాల సరసన సగర్వంగా నిలిచింది.
చరిత్ర ఏంటంటే..?
ఓరుగల్లు కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో 12వ శతాబ్దంలో గణపతిదేవుని హయాంలో వారి సామంతరాజు రేచర్ల రుద్రయ్య (రుద్రుడు) దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కళాత్మకతకు, అద్భుత శిల్ప సంపదకు, చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు, ఎన్నో ప్రత్యేకతలకు నెలవు రామప్ప. జైతుగి అనే రాజు యుద్ధంలో గణపతిదేవుడిని ఓడించి అక్కడే ఆయన్ని బంధించాడు. రేచర్ల రుద్రుడు జైతుగితో పోరాడి గణపతి దేవుణ్ని విడిపించాడు. అందుకు బహుమానంగా రామప్ప ఆలయాన్ని ఇచ్చేందుకు క్రీ.శ 1173లో పనులు ప్రారంభించారు. 40 ఏళ్ల తర్వాత క్రీ.శ 1213లో పూర్తి చేశారు.
శిల్పి పేరుతో ఆలయం
సాధారణంగా ఆలయాలు దేవుడి పేరుతో ప్రాచుర్యం పొందుతాయి. కాకతీయులు కట్టించిన ఆలయాలకు ఆయా రాజుల పేర్లుంటాయి. కానీ, రామప్ప ఆలయం మాత్రం శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందింది. కాకతీయుల రాజు గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు కట్టించిన రామప్ప అనే శిల్పి పేరుతోనే వాడుకలో ఉంది. రామప్ప కర్ణాటక నుంచి వచ్చినట్లు చెబుతారు. అద్భుతమైన శిల్పకళ ప్రదర్శించడంతో శిల్పి పేరును పెట్టినట్లు జానపదాల్లో ప్రతీతి.
550 ఏళ్లు అడవుల్లోనే..!
1213లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు కొనసాగాయి. ముస్లిం రాజుల దండయాత్రతో కాకతీయుల ప్రస్థానం ముగియడంతో సుమారు 550 ఏళ్లపాటు ఎలాంటి ఆదరణ లేక చిట్టడవుల్లో, కారుచీకట్లలో కమ్ముకుపోయింది. 1900లో నిజాం రాజుల దగ్గర పని చేసే సామంత రాజు దానిని గుర్తించి దేవాలయం అంచులు పడిపోకుండా సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి వెలుగులోకి తీసుకువచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1951లో పురావస్తు శాఖ దీనిని ఆధీనంలోకి తీసుకుంది.
యునెస్కో గుర్తింపు ఎందుకంటే..?
* రామప్ప ఆలయ శిఖరాన్ని నీళ్లలో తేలియాడే చాలా తేలికపాటి ఇటుకలతో రూపొందించారు.
* భూకంపాలు వచ్చినా కుంగి పోకుండా ఇసుకలో పునాది (శాండ్ బాక్స్ పరిజ్ఞానం)తో నిర్మించారు.
* ఆలయం నిర్మించిన కృష్ణ శిల ప్రపంచంలోనే కఠిన శిలగా పేరొందిన నల్లరాయి (బ్లాక్ డోలరైట్). ఈ శిలతో అందమైన శిల్ప కళాకృతులను మలచిన తీరు దేశంలో మరెక్కడా లేదు.
రాళ్లు స్వరాలు పలుకుతాయి
కాకతీయుల ఆలయ నిర్మాణాలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప గుడి సైతం ఆ ఆకారంలోనే ఉంటుంది. గర్భగుడి, మహామండపంతో మూడువైపులా ప్రవేశానికి వీలుంటుంది. జీవం ఉట్టిపడే శిల్పకళాకృతులతో పాటు.. స్వరాలు పలికే శిల్పాలూ ఉన్నాయి. రాతి స్తంభాల మధ్య సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషం. ఆలయం అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడిపై మాత్రం ఎప్పుడూ వెలుతురు పడుతూ ఉంటుంది. రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలు ఉన్నాయి.
నంది మనల్నే చూస్తుంది
ఆలయానికి మరో ప్రధానాకర్షణ నంది విగ్రహం. గర్భగుడికి ఎదురుగా ఉన్న ఈ నంది శివుని ఆజ్ఞ కోసం వేచిచూస్తున్నట్లు ఉంటుంది. శంభుడి ఆన రాగానే ఉరికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉంటుంది. ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉన్నా ఏ మాత్రం చెక్కుచెదరకుండా జీవకళ ఉట్టిపడే తేజస్సుతో ఉంటుంది. దీనిని ఎటునుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లుగా అనిపించడం శిల్పి గొప్పతనం.
మొదటి కట్టడం రామప్ప
తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కిన మొదటి కట్టడం రామప్ప. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతగల వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలిసిన ప్రాంతాలకు వారసత్వ హోదా ఇస్తుంది. ఇలా మన దేశంలో ఇప్పటివరకు 38 ప్రాంతాలకు గుర్తింపు ఇచ్చింది. వాటిలో 30 వారసత్వ కట్టడాలు కాగా, ఏడు సహజ వింతలు. ఒకటి చరిత్ర, సహజ వింత కలిసిన ప్రాంతం. రామప్ప దేశంలో 39వ కట్టడం.
ఈ గుర్తింపుతో లాభాలూ ఉన్నాయ్..
యునెస్కో గుర్తింపు వల్ల ఆలయం కొలువై ఉన్న పాలంపేట గ్రామం అంతర్జాతీయ పర్యాటక పటంలో గుర్తింపు పొందుతుంది. దీని పరిరక్షణ, నిర్వహణకు ‘ప్రపంచ వారసత్వ నిధి’ ద్వారా నిధులు అందుతాయి. దీంతో పాటు అంతర్జాతీయంగా అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తాయి. కేంద్ర పురావస్తుశాఖ ఏటా ప్రత్యేక నిధులు కేటాయించి పరిరక్షించాల్సి ఉంటుంది. దేశ, విదేశీ యాత్రికుల రాక పెరిగి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన వరంగల్లో ప్రతిపాదిత మామునూరు విమానాశ్రయం పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది.