బొడ్రాయి అంటే ఏమిటి ? దీన్ని విశిష్టత ఏమిటి

ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఒకటి ఉంటుంది. దానిని ఊరి వాకిలి (జనవ్యవహారంలో-ఉరాకిలి), చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. ప్రతి ఊరి మధ్యలో బొడ్రాయి ఉంటుంది. ఈ బొడ్రాయి గురించి ప్రస్తుత కాలం వారికి అంతగా అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చును. అయితే ఊరుకి మధ్యలో బొడ్రాయిని ఎందుకు స్థాపిస్తారు..? ఎప్పుడు స్థాపిస్తారు..? దీని ప్రాముఖ్యత ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం.

Bodraiఎక్కడే గాని ఊరును కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సబ్బండ వర్ణాల కులపెద్దలందరూ కలిసి ఆయా పరిసర ప్రాంతంలో ఉన్న పీఠాధిపతిని కలిసి వారి సూచనల మేరకు అనుభవజ్ఞులైన శాస్త్ర పండితుల పర్యవేక్షణలో ఊరును ఎంత స్థల విస్తీర్ణంతో నిర్మించదలచుకున్నారో అనే అంశంపై ఒక అవగాహణకు వస్తారు. మానవ శరీర మధ్యభాగంలో బొడ్డులాగా గ్రామానికి బొడ్రాయి కూడా మధ్యభాగమైన బొడ్డు భాగం అవుతుంది కాబట్టి దీనికి బొడ్డురాయి అని పేరు వచ్చింది. మొదట ఊరి యొక్క పొలిమేరలను ఏర్పాటు చేసుకుని దిక్బంధన చేసుకుని దిక్కులు విధిక్కుల చుట్టు కొలత వైశాల్యానికి సెంటర్ పాయింట్ తీసుకిని ఆ స్థలాన్ని గ్రామానికి మధ్యభాగంగా నిర్ణయించి అక్కడ బొడ్డురాయిని శాస్త్రోక్తమైన విధి విధానాలతో పూజించి ప్రతిష్టాపన చేస్తారు. వాస్తు పురుషుని శరీరానికి మణిపూరకచక్ర స్థానమే ఈ బొడ్రాయి స్థానం, అంటే వాస్తు పురుషుని యొక్క నాభి ( బొడ్డు ) స్థానం అన్నమాట.

Bodraiస్వాధిష్ఠాన చక్రానికి పైన మూడంగులాలలో నాభిలో ఒక అగ్ని నిలయమై మణిలాగా ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణం కలిగి మొత్తం పది రేకులతో వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపాలు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత. విశ్వంలోని విశ్వశక్తి గ్రామంలోకి ప్రవేశించేందుకు మణిపూరక చక్రం ముఖ ద్వారంగా ఉపయోగపడుతుంది. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మణిపూరక చక్రం గురించి చెప్పిన వర్ణన ఇది. తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణం కలది. అనిర్వాచ్యమైనది.

Bodraiఅంధకారాన్ని పోగొట్టు మెరుపుతో కూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచేత తప్తంలైన ముల్లోకాలను చల్లబరుస్తుంది. మానవ శరీరంలో షట్చక్రాలు ఉన్నట్టుగానే వాస్తు పురుషుని శరీరానికి షట్చక్రాలు ఉంటాయి. కాబట్టి వాస్తు సూత్ర ప్రకారంగా వర్గులను నిర్ణయించి ఆయా వర్గులకు అనుగుణంగా దిక్కులు, విధిక్కులకు అనుగుణంగా నూతన గ్రామానికి ఏ ప్రాంతంలో ఎలాంటి వసతులు ఉండాలి అని నిర్ధారణ చేసి గ్రామంలో నివసించే ప్రజలందరికీ మేలు కలుగజేసే విధంగా వర్గుల ఆధారంగా రోడ్లు, కూడళ్ళు, బావులు, చెరువులు, దేవాలయాలు, స్కూళ్ళు, వైద్యశాలలు, వ్యవసాయ, వ్యాపార సముదాయాలు, స్మశాన వాటిక.. మొదలగునవి నిర్మాణం చేస్తారు.

Bodraiఅలాగే ఆ గ్రామంలో నివసించే ప్రజలను వర్గాల వారిగా వారి వారి వర్ణ లేక నామ అక్షరాలకు అనుగుణంగా వారిని గృహ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయిస్తారు. పండితుల సూచనల మేరకే గ్రామ ప్రజలు నిర్మాణం చేసుకుంటారు. పూర్వకాలంలో ఈ బోడ్రాయిని బైండ్ల వారు పుట్టురాయిని తెచ్చి ఒకటి పెద్దది పురుష దేవుని స్వరూపంగా భావించి దాని ప్రక్కనే ఒక చిన్న పుట్టురాయి భూలక్ష్మిదేవి స్వరూపంగా భావించి స్థాపించే వారు. ఈ రెండింటిని స్త్రీ, పురుష శక్తులుగా భావించేవారు. ఆ తర్వత కాలంలో ఈ కార్యక్రమం పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించడం ప్రారంభమైంది.

Bodraiఈ బొడ్రాయిని ఆధునిక కాలంలో ఒకే రాయితో స్థాపన చేయడంలోని ఆంతర్యాన్ని గమనిస్తే బొడ్డురాయి స్థాపితం చేసిన తర్వాత చూడడానికి మాత్రం మనకు పై భాగం లింగాకారంగా కనిపిస్తుంది. కానీ ఈ బొడ్రాయి మొత్తం పొడవును మూడు భాగాలుగా విభజించి ఒక్కోక్క భాగాన్ని ఒక్కో విశిష్టతతో చెక్కుతారు. క్రింది భాగం నాలుగు పలకలుగా చతురస్రంగా చెక్కుతారు. ఈ నాలుగు పలకలను బ్రహ్మ స్వరూపంగా భావిస్తారు, మధ్యభాగాన్ని ఎనమిది పలుకలుగా విష్ణువు ప్రతీకగా.. పై భాగాన్ని లింగాకారంగా చెక్కి శివ స్వరూపానికి ప్రతీకగా భావిస్తారు. గ్రామ పొలిమేరలలో ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది స్త్రీ మూర్తి దేవతలు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు.

Bodraiగ్రామ పొలిమేరలను ఈ ఎనిమిది మంది దేవతలు అక్కచెల్లెళ్ళు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు, ఈ ఎనిమిది మంది పొలిమేర దేవతలకు ఆధిదేవత శీతలాదేవి అమ్మవారు గ్రామ ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి బొడ్డు రాయి క్రింద శీతాలాదేవి అమ్మవారి యంత్రం స్థాపితం చేస్తారు. ఇలా ఈ బొడ్రాయి అంటే ఒక్క విగ్రహమని కాదు. స్త్రీ, పురుష దేవతా స్వరూపమై, సమస్త దేవతల సమాహారంగా మారి, శక్తి వంతమైన తేజస్సుతో గ్రామం మధ్య నుండి ఎనిమిది దిక్కులలో విస్తరించి ఎల్లప్పుడూ గ్రామానికి రక్షణగా నిలుస్తుంది ఈ బొడ్డురాయి దేవత.

శీతలదేవి యంత్రం:- బొడ్రాయి క్రింద శక్తి స్వరూపమైన శీతలాదేవి అమ్మవారి యంత్ర స్థాపన చేస్తారు. పొలిమేరలో ఉన్న దిక్కుల వారిగా ఆయా దిక్కులకు సంబంధించిన యత్రాలు స్థాపితం చేస్తారు.

Bodraiజీర్ణోద్ధారణ పున:ప్రతిష్ట :- బొడ్రాయి ఫూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పున:ప్రతిష్టాపన చేస్తారు. ఆ సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏ గ్రామంలోనైనా ఏ కారణాల చేతనైన భిన్నమైన లేదా నగర విస్తీర్ణంలో భాగంగా రోడ్ల వెడల్పులో బోడ్రాయికి అంతరాయం లేదా హాని కలిగిస్తే బొడ్రాయి ప్రస్తుతం ఉన్న స్థానం నుండి కేవలం 5 నుండి 10 మీటర్ల లోపు వసతిని బట్టి మార్చుకోవచ్చు. ఇందుకు ఏ దోషం వర్తించదు. భూమిపై గద్దె నిర్మించి అక్కడ జీర్ణోద్ధారణ పున:ప్రతిష్ట పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తే ఎలాంటి దోషాలు, అరిష్టాలు కలుగవు.

శయ్యాది వాస పూజలు:- కొత్తగా తయారు చేయించిన బొడ్రాయికి పుణ్యాహావాచనం, ప్రాయశ్చిత్త హోమం, జలాధి వాసం, ధాన్యాది వాసం, పంచగవ్యాధి వాసం, మూలమంత్ర హోమం, అష్టదిక్బంధన, కూష్మండ, నారికేళ, జంభీరఫలం, గూడాన్నం, పొంగలి మొదలగు వాటితో బలిహరణ చేసి, పూర్ణాహుతి నివేదన, ప్రాణ ప్రతిష్ట మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రామాలు నిర్వహించాల్సి ఉంటుంది.

Bodraiవార్షికోత్సవం :- ఈ బొడ్రాయి పండగ అంటే యావత్తు గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక్క పండగ బొడ్రాయి పండగ. ప్రతిష్ట చేసిన మొదటి సారి పంచాంగం ప్రకారం ఏ మాసంలో ఏ పక్షంలో ఏ తిధి రోజున ప్రతిష్ట చేస్తారో ప్రతి సంవత్సరం కూడా అదే మాసం అదే పక్షం అదే తిధి రోజు ప్రతి ఏటా గ్రామస్తులు ఈ పండగను సబండ వర్ణాల వారు వారసత్వంగా కలిసిమెలిసి ఘనంగా వార్షికోత్సం జరుపుకుంటారు. గ్రామ ప్రజలు ప్రతి దసరా రోజున కూడ బొడ్రాయి పూజ చేసి ఆశీస్సులు పొందుతారు. బొడ్రాయి పండగ రోజు ఆ ఊరి ఆడపడచులు అందరూ తప్పక హాజరు అవుతారు.

బలిహరణ :- బెల్లంతో చేసిన అన్నం, పొంగలి నివేదన చేస్తారు. నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, కొబ్బరికాయతో బలిహరణ ఇస్తారు.

ప్రాంతీయ ఆచారాలు:- ఈ బొడ్రాయి పండగ తెలంగాణ, రాయలసీమ ప్రాంతలో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందింది. మిగితా ప్రాంతాలలో అంత ప్రాచుర్యంలో లేదు. ఈ పండగ ప్రాంతాల వారిగా ఆచార వ్యవహాలలో స్వల్ప భేదాలు కనబడుతాయి. దీనికి ముఖ్యంగా దక్షిణాయణంలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు, ఆశ్వీయుజమాసంలో మొదలైయ్యే బతుకమ్మ పండగ రోజుల్లో బొడ్రాయి పూజలు విశేషంగా జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో జంతు బలిహరణ కూడాచేస్తారు.

Bodraiగ్రామదేవతకు ప్రతినిథిగా ఈ బోడ్రాయిని భావిస్తారు. ఇది గ్రామానికే ధ్వజస్థంభం లాంటిది. ఈ రాయిని ప్రతిష్టించే ఆ గ్రామంలోని ప్రజలకు కొన్ని ఆంక్షలను విధిస్తారు. ప్రతిష్ట జరిగే రోజు ఊర్లోని వారంతా గ్రామంలోనే ఉండాలి. ఊరి పొలిమేరను ఎవరూ దాటకూడదు. అలాగే పెళ్లిళ్లు చేసుకుని వేరే చోట ఉండే ఆ గ్రామ ఆడపడుచులందరినీ ఈ పండగకు తప్పకుండా పిలిపిస్తారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని పెద్దలు అంటారు. ఊరిలోని వారంతా కలిసి ఐకమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం. ప్రతిష్ట చేయడమే కాకుండా ప్రతి ఏటా వార్షికోత్సవం ఉత్సవాలను జరపడం కూడా ఆనవాయితీ.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR