సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం.
తిరుమల తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు దాదాపుగా శ్రీకాళహస్తి వెళ్లి పరం శివుణ్ణి దర్శించుకుంటారు. అలాగే అక్కడ రాహు కేతువులకు పూజ చేయించుకొని ఇంటికి వస్తూ ఉంటారు.
అయితే కొంత మంది శ్రీకాళహస్తి దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళటం తప్పని అంటున్నారు పండితులు. అసలు శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
ఈ విశాల విశ్వము గాలి,నింగి,నేల,నీరు,నిప్పు అనే పంచభూతాల నిలయంగా ఉంది. ఆ పంచ భూతాలు భూమి మీద పంచ భూత లింగాలుగా వెలిసాయి. వాటిలో వాయు లింగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసింది.
ఈ ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఒక నియమం ఉంది. అయితే ఆ నియమం వెనక ఒక పరమార్ధం కూడా ఉంది.
శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో ఏవైనా సర్ప దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్ళాలి. ఎందుకంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళితేనే దోష నివారణ జరుగుతుంది. తిరిగి ఏ దేవాలయానికి వెళ్లిన దోష నివారణ జరగదని అంటూ ఉంటారు.
గ్రహణాలు, శని బాధలు పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం.
గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచి ఉంటుంది. అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి.