ఏడాదిలో ఏరోజూ వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతినాడు వాడుతారు…! ఎందుకంటే?

రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగ సంక్రాంతి. సూర్యుడు భూమధ్య రేఖకి ఉత్తరంగా ప్రయాణించటాన్ని ఉత్తరాయణమనీ, దక్షిణంగా ప్రయాణించటాన్ని దక్షిణాయమనీ అంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడుగనుక ఉత్తరాయణాన్ని మకర సంక్రాంతి, మకర సంక్రమణమనీ, అలాగే దక్షిణాయంలో సూర్యుడు కర్కాటకం రాశిలో ప్రవేశించటాన్ని కర్కాటక సంక్రమణమనీ అంటారు. సంక్రాంతి అన్నా, సంక్రమణం అన్నా జరగటం అని అర్ధం. అంతేకాదు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయణం దేవతలకు రాత్రిగా భావిస్తారు.
సంక్రాంతి అంటే ఒక్కరోజులో హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. మూడ్రోజుల మురిపెం అంత కన్నా కాదు. రావటానికి నెల, పోవటానికి నెల సమయం తీసుకునే పండగ. ఆ గమనాగమన కాలమంతా తన జ్ఞాపకాలను, సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండగ. ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి ఆగమన ఆనవాళ్లు మన కళ్లకు కడతాయి. ముంగిళ్లు అందమైన ముగ్గులతో పరవశిస్తాయి.
హేమంత రుతువులో మార్గశిర మాసపు శీతల గాలులు… మంచు కురిసే వేళలు… ఇదే తరుణంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి.  సంక్రాంతి తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే.
అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్‌లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాల్లో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘి అని పిలుస్తారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భమూ, సంతోషానికి కారణాలు అన్ని చోట్లా ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే. కళ్లం నుంచి ఎడ్ల బళ్లమీద ధాన్యం ఇంటికి చేరే సరికి రైతు కళ్లు ఆనందంతో మెరుస్తుంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు.
తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందునుంచే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో ఇంటిముందు రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. నెలరోజుల పాటు తన హరినామ సంకీర్తనతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు. హరిణి కీర్తిస్తూ వచ్చే హరిదాసు సాక్షాత్ కృష్ణుడే ఈ రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు.
అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలవాళ్ల, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక కోళ్లపందాలు, ఎడ్లపందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి.
ఈ పండగ ప్రత్యేకత ఏమిటంటే.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు బాహురమణీయంగా ఉంటాయి. గంగిరెద్దులు పండుగ బహుమానంగా బట్టలు పిండివంటలు.. దానం ఇస్తే.. అవి కృతజ్ఞతగా తలలు ఊపే దృశ్యం చూడచక్కనైంది. అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు చేసే సందడి అంతాఇంతాకాదు..కాలక్రమంలో గంగిరెద్దులాట మాయమైపోతుంది..
కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువును తీర్చిద్దితారు పురాణ హితిహాసాలతో కూడిన బొమ్మలను కొలువుగా ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు సందడి చేస్తారు.
ఇక ఏడాదిలో ఏరోజూ వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతినాడు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు.
ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఈ పండుగ ఏటా దాదాపు జనవరి 14నే రావడం. దీనికి ప్రధాన కారణమేమంటే… హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈ పండుగలు వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది.  అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో దాదాపుగా మార్పు ఉండదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR