పంచ పాండవులలో భీముడు ఒకడు. ద్రౌపతి పాండవులకు భార్య అనే విషయం అందరికి తెలిసిందే. అయితే భీముడు హిడింబిని పెళ్లి చేసుకోవడం వారికీ ఒక కుమారుడు జన్మించడం వెనుక ఒక కథ ఉంది. మరి భీముడు హిడింబిని పెళ్లికి చేసుకోవడానికి గల కారణం ఏంటన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దుర్యోధనుడు పాండవులను మట్టుపెట్టేందుకు ఒక లక్క ఇంటిని నిర్మిస్తాడు. ఆ లక్క ఇంట్లోంచి ఉన్న సొరంగం గుండా తప్పించుకొని పాండవులు ఒక అరణ్య ప్రాంతానికి చేరుకొని అక్కడ సేదతీరుతారు. అక్కడికి సమీపంలోనే హిడింబ, హిడింబి అనే అన్నాచెల్లెళ్లు నివసిస్తూ ఉంటారు. రాక్షసులైన ఈ అన్నాచెల్లెళ్ల ముక్కుపుటాలకి నరవాసన తగలగానే జిహ్వచాపల్యం కలుగుతుంది. ఆ నరవాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని బయల్దేరిన వారికి అల్లంత దూరంలో గాఢనిద్రలో ఉన్న పాండవులూ, వారికి కాపలాగా ఉన్న భీముడూ కనిపిస్తారు. మంచి కండపట్టి బలిష్టంగా ఉన్న భీముని చూడగానే హిడింబకు ఓ ఆలోచన కలుగుతుంది. అతడిని ఎలాగైనా పక్కకు తీసుకువస్తే సుష్టుగా ఆరగించవచ్చని తన సోదరికి సూచిస్తాడు. దాంతో భీముని ఆకర్షించేందుకు హిడింబి అందమైన యువతి రూపంలో భీముని చెంతకు చేరుకుంటుంది. భీముని మోసం చేయాలనుకున్న హిడింబి ప్రయత్నం ఏమాత్రమూ నెరవేరదు. ఆమెను చూసి భీముడు ఇసుమంతైనా చలించకపోవడంతో అతని వ్యక్తిత్వం పట్ల నిజంగానే ఆకర్షితురాలవుతుంది హిడింబి. అంతేకాదు తన నిజస్వరూపాన్ని అతనికి చూపి, నిజాయితీగా తాను వచ్చిన పనిని ఒప్పుకుంటుంది. దాంతో కోపోద్రిక్తుడైన భీముడు, హిడింబి సోదరుని మీదకు యుద్ధానికి వెళ్తాడు. ఆ భీకర యుద్ధంలో హిడింబ చనిపోతాడు. కానీ భీముడి కోపం అంతటితో చల్లారదు. తన సోదరుని చావుకి హిడింబి ప్రతీకారం తీర్చుకుంటుందేమో అన్న అనుమానంతో… హిడింబిని కూడా చంపేందుకు ఉద్యుక్తుడవుతాడు. కానీ ధర్మరాజు అడ్డుకోవడంతో భీముడి కోపానికి అడ్డుకట్ట పడుతుంది.హిడింబి మనసులో భీముడు నిలిచిపోయాడని కుంతీదేవి గ్రహించి ఆమెను వివాహం చేసుకోమంటూ భీమునికి సూచిస్తుంది. ఎట్టకేలకు హిడింబిని వివాహం చేసుకునేందుకు భీముడు అంగీకరిస్తాడు. కానీ అందుకో షరతుని కూడా పేర్కొంటాడు. తాను ఎల్లకాలం హిడింబితో కలిసి ఉండలేననీ, వారిద్దరికీ ఓ శిశువు జన్మించగానే అక్కడి నుంచి వెళ్లిపోతానన్నదే ఆ షరతు. దానికి హిడింబి ఒప్పుకోవడంతో వారిరువురి వివాహం జరుగుతుంది. హిడింబికి భీముని ద్వారా అనతికాలంలోనే ఓ శిశువు జన్మిస్తాడు. అతని తల ఘటం ఆకారంలో ఉండటంతో ‘ఘటోత్కచుడు’ అని పేరు పెడతారు. తమ మధ్య ఉన్న షరతు ప్రకారం ఘటోత్కచుడు జన్మించిన తరువాత భీముడు హిడింబిని విడిచి వెళ్లిపోతాడు.భీముడు తనని విడిచి వెళ్లిపోయిన తరువాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది. ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపాంతరం చెందిందని నమ్ముతారు. హిడింబిని ఒక దేవతగానూ, ఆటవిక జాతులవారికి ప్రతీకగానూ చాలాచోట్ల పూజిస్తారు. ఈ విధంగా రాక్షసి అయినా హిడింబి తన స్వచ్ఛమైన మనసుతో భీముడిని పెళ్లి చేసుకొని ఒక కుమారుడికి జన్మనిచ్చిన తరువాత అరణ్యంలో తపస్సు చేసుకుంటూ కాలక్రమేణా ఒక దేవతగా నిలిచింది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.