దేశంలో ఎక్కడ లేని విధంగా త్రిమూర్తులు ఒకేచోట లింగ రూపంలో ఉండటం ఇక్కడి ఆలయ విశేషం. ఇదేకాకుండా ఈ ఆలయానికి శూచింద్రం అనే పేరు రావడం వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. మరి త్రిమూర్తులు ఇక్కడ ఎందుకు వెలిశారు? ఆ పేరు రావడం వెనుక గల కారణం ఏంటి? అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 10 కి.మీ. దూరంలో నాగర్ కోయిల్ నుండి 3 కి.మీ. దూరంలో “శూచింద్రం” అనే పుణ్యక్షేత్రము ఉంది. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఆలయంలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక ఈ ఆలయానికి శూచింద్రం అనే పేరు రావడానికి కారణం ఏంటి అంటే, గౌతమమహర్షి భార్య అహల్యను పొందాలని దేవేంద్రుడు అనుకుంటాడు. అయితే తొలికోడి కూయగానే నదీ స్నానానికి వెళ్లడం గౌతముడికి అలవాటు. అది తెలుసుకున్న దేవేంద్రుడు, తెల్లవారకమునుపే కోడిలా కూస్తాడు. తెల్లవారిందనుకుని గౌతముడు నదికి వెళ్లగానే, ఆయన రూపంలో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. తెల్లవారడానికి ఇంకా సమయముందని గ్రహించిన గౌతముడు ఆశ్రమానికి తిరిగివస్తాడు. అప్పుడు అహల్యతో పాటు తన రూపంలో గల దేవేంద్రుడిని చూసి ఆగ్రహానికి గురై ఇద్దరినీ కూడా శపిస్తాడు. అయితే రాముడి పాదస్పర్శతో అహల్యకి శాపవిమోచనం జరుగుతుందని చెప్పిన గౌతముడు, త్రిమూర్తులు ఒకే చోట ఆవిర్భవించిన ప్రదేశానికి వెళ్లి వాళ్ల అనుగ్రహాన్ని సంపాదించమని దేవేంద్రుడికి సూచిస్తాడు. అనసూయా మాత పాతివ్రత్యాన్ని పరీక్షించిన త్రిమూర్తులు అక్కడ స్వయంభూలింగాలుగా ఆవిర్భవించారని తెలిసిన దేవేంద్రుడు ఆ ప్రదేశానికి వెళతాడు. తన తపస్సుచే త్రిమూర్తులను ఒప్పించి శాపవిమోచనాన్ని పొందుతాడు. దోషం నుంచి, శాపం నుంచి ఇంద్రుడు శుచి ని పొందిన చోటు కావడం వలన ఈ ప్రదేశానికి “శూచింద్రం” అనే పేరు వచ్చింది. ఇక ఆలయ పురాణానికి వస్తే, ఈ క్షేత్ర పరిసరాలలో పెద్ద అరణ్యం ఉండేది. అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ ఈ ప్రాంతంలో ఉండి తపస్సు చేసారని ప్రతీతి. అనసూయాదేవి పరమ సాద్వి, ఆదర్శ ప్రతివ్రత. ఆమెని పరీక్షించేందుకు వచ్చిన త్రిమూర్తులు ఆమెను దిగంబరంగా ఉండి తమకు బిక్ష ఇవ్వమని అడుగగా అందుకు అంగీకరించి, ఆమె ప్రతివత్య మహిమతో వారిని పసిపాపలుగా మర్చి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసింది.ఇంతలో విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు ముగ్గురు వచ్చి, అనసూయని ప్రార్ధించి తమ తమ భర్తలను పొందారు. అప్పుడు అత్రి, అనసూయ కోరికను మన్నించి త్రిమూర్తులు ముగ్గురు కలసి ఏకరూపంగా మూడు శిరస్సులతో పుత్రీనిగా అనసూయ, అత్రి దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు. అలా ఆ త్రిమూర్తులు ముగ్గురి అంశలు కలసి ఉత్భవించిన రూపమే ఈ ఆలయంలో ఉన్న శివలింగ రూపం. ఈ మహా శివలింగంలోని పాదభాగం బ్రహ్మ, మధ్యభాగం విష్ణువు, శిరోభాగం శివస్వరూపం.
అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా అన్ని పాపాలు శుచి అయిపోయి జన్మ తరించిపోతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.