రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నాగదేవత క్షేత్రాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ నాగదేవత విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లాలోని, తిరుమలగిరిలో శ్రీ నాగదేవత ఆలయం ఉన్నది. ఈ ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి 8 కీ.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ నాగదేవత, శ్రీ నారాయణస్వామి, శ్రీ జయలక్ష్మి అమ్మవార్ల గురుస్థానంగా సుప్రసిద్ధమైనది. ఈ ఆలయానికి కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిషు వారు అకృత్యాల ఫలితంగా ఇక్కడ ఉన్న నాగమ్మ ఆలయం శీలమైందని తెలుస్తుంది.
అదేసమయంలో నాగదేవత భక్తురాలైన యోగినీమాత జయలక్ష్మి అమ్మ కలలో కన్పించి తనకొక ఆలయం నిర్మించమని చెప్పగా, ఆ తల్లి అభీష్టం మేరకు యోగిని మాత జయలక్ష్మి అమ్మ అనేక కష్టాలను ఓర్చి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. యోగినీమాత జయలక్ష్మి అమ్మ 1997 మార్చి 26 వ తేదీన జీవసమాధి చెందారు. ఇక్కడ ఎత్తైన రాజగోపురం గురు స్థానంలో నిర్మించారు. ఏడంతస్తుల రాజగోపురంపై ఏడు కలశాలు నిర్మించారు. గోపురానికి నాలుగు వైపులా నాగదేవత, నారాయణస్వామి వార్ల శిల్పాలతో పాటు, నాగశక్తులు, ద్వారశక్తుల్ని పొందుపరిచారు.
గర్భాలయంలో నాగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారి మూర్తి పంచలోహాలతో నిర్మితమై ఉన్నది. అమ్మవారి మూలస్థానంగా ఈ గర్బాలయాన్ని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మహాగణపతి సన్నిధి ఉంది. ఆలయ ప్రాగణంలో ఉన్న మంటపంలో వివిధ వర్ణాకృతులు కలిగిన స్తంభాలపై నాగమ్మ, నారాయణస్వామి, జయలక్ష్మి మాత శిల్పాలతో పాటు నాగబంధాలు ఉన్నాయి.
అర్థమంటపంలో చతుర్ముఖ నాగదేవత శిల్పం ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. గర్భగుడి ప్రధానద్వారానికి ఇరువైపులా ద్వారజ్యోతి కన్యల విగ్రహాలు ఉన్నాయి.
ఇచట ప్రతి సంవత్సరం తమిళ నూతన సంవత్సరారంభన కావడి పూజ నిర్వహించి, దీనిలో భాగంగా సుబ్రహ్మణ్యస్వామికి పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిసంవత్సరం శ్రావణమాసంలో వచ్చే శుక్ల నాగపంచమి మహోత్సవ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. అంతేకాకుండా మాఘమాసమున పౌర్ణమి రోజున జయలక్షి అమ్మవారి ఆరాధనోత్సవాలు ఘనంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు.