ఆదిదేవుడైనా శంకరుడు సర్వసృష్టిలోని అందానికి అధిదేవత కనుక ఈ స్వామికి మంజునాథుడు అనే పేరు సార్థకమైనది. ‘మంజు’ అంటే అందమైనది. అలాగే కన్నడంలో ‘మంజు’ అంటే ‘మంచు’ అని అర్ధం. మంచుతో నిండిన కైలాస పర్వతం మీద నివసించేవాడు కనుక ఈ స్వామికి మంజునాథుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి గల పురాణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని పశ్చిమ కనుమల మధ్యగా మంగళూరు నుండి సుమారు 25 కి.మీ. దూరంలో షిరాది అనే ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధర్మస్థల ఉంది. ఇచ్చట మంజునాథస్వామి వారి దేవాలయం ఉన్నదీ. మంజునాథస్వామి ఆలయ ప్రాంగణం చుస్తునంత సేపు భక్తులను దృష్టిమరల్చనీయదు. ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. ఆలయానికి సంబంధించిన గోపురాదులు ఏవీ భక్తులకు కనిపించవు. ప్రధానాలయం ఆలయానికి ముందుభాగంలో పెద్దదిగా ఉన్న గంట భక్తులను ఆకట్టుకొంటుంది. అలనాటి కాలం నాటిదిగా దీనిని చెబుతారు.
ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం నెల్యాదివీడులో అమ్మాదేవి బళ్ళారి, బ్రహ్మన్న ప్రెగ్గడెలనే పుణ్యదంపతులుండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత దయామయులు. ధర్మాన్ని కాపాడుతూ, ధర్మపరిరక్షణ కోసం నిత్యం తపనపడుతూ వుండేవారు. ఒకసారి ధర్మదేవతలు మానవ రూపం ధరించి నెల్యాదివీడు ను తమకిచ్చి, సమీపాన ఒక గృహాన్ని నిర్మించి అందులో నివసించమని, అలాచేస్తే వారి ఐశ్వర్యం పదింతలవుతుందని చెప్పి అదృశ్యమయ్యారుట, ధర్మదేవతల అభీష్టంమేరకు ఆ దంపతులు అలాగే చేశారట. అనంతరం ధర్మదేవతలు ఆ దంపతులకు స్వప్నంలో కనిపించి తాము కాలరాహు, కాలర్కై, కుమారస్వామి, కన్యాకుమారి అనే ధర్మదేవతలమని, తమకు గుడులను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారట. అయితే ధర్మదేవతలతోపాటు ఇతర దైవాలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కల్గదని భావించి, ఆ దంపతులు ధర్మదేవతల అభీష్టంమేరకు కదిరి నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి, ప్రతిష్ఠించారట.
ఈ ధర్మస్థలంలోని శ్రీ మంజునాధస్వామికి అన్న మాట నిలబెట్టుకునే స్వామి అని ప్రసిద్ధి చెందాడు. అంటే మనం ఏది అయినా కోరికను ఆయనకు మనవి చేసుకుంటే, దానికి అయన అనుగ్రహిస్తే అయన ఆ కోరికను తప్పకుండ నెరవేర్చుతాడని ఇక్కడ ఉన్న భక్తుల ప్రగాఢ నమ్మకం.
ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి క్షేత్రంలో ఏటా లక్ష దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఏటా కార్తీక బహుళ దశమి మొదలుకుని అమావాస్యవరకూ ఐదు రోజులపాటు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.