ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం చిన్న బాలుని రూపంలో ఉండి, అత్యంత సుందరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో కృష్ణుడు రోజు వేడి నీటితో స్నానం చేస్తాడు. అయితే ప్రతి రోజు స్వామివారికి పెద్ద పెద్ద గుండి గలతో వేడినీళ్లు కాచి మహశుద్దిగా పోస్తారు. దక్షిణ ద్వారక అని పిలువబడే ఈ ఆలయానికి ప్రతి రోజు భక్తులు ముప్పై వేలకు పైగా వస్తుంటారని చెబుతారు. మరి శ్రీ కృష్ణుడు ఇక్కడ ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం, త్రిసూర్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో గురువాయూర్ లో శ్రీకృష్ణ భగవానుడి ఆలయం ఉంది. ఈ ఆలయం కేరళలోని పవిత్రమైన గొప్ప విష్ణు క్షేత్రం. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలువబడుతున్నాడు. శ్రీకృష్ణుడి అనుమతి లేనిదే ఈ ఆలయానికి రాలేరని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇంకా నయం కానీ దీర్ఘవ్యాధులు కూడా నయం చేసే శక్తి ఈ స్వామికి ఉందని అక్కడి స్థానిక భక్తుల నమ్మకం. గురువు అంటే బృహస్పతి, వాయుదేవుడు ఈ ఇద్దరి పేర్లు కలిపి గురువాయుపురం లేక గురువాయూరు అయినది అని చెబుతారు. ఈ ఆలయ పురాణానికి వస్తే, ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమనీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు. గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు.శంఖచక్రగదాపద్మాలను చతుర్భుజాల్లో ధరించి పుష్పమాలాలంకృతుడై కస్తూరీ తిలకాంకితుడైన చిన్నికృష్ణుని రూపాన్ని చూడగానే భక్తులు ఆనందపరవశులవుతారు. నాలుగున్నర అడుగుల ఎత్తున్న ఆ చిన్మయమూర్తిని చూసినవారి హృదయాల్లో చింత చింతాకైనా ఉండదన్నది భక్తుల నమ్మకం. ఎన్నో బాధలతో ఈ నారాయణ సన్నిధానానికి వచ్చి శరణు వేడిన వారంతా తేలికపడ్డ మనసుతో ఇంటికి వెళ్తారట.భూలోక వైకుంఠం అని పిలువబడే ఈ ఆలయంలోని స్వామివారిని 12 సార్లు దర్శనం చేసుకుంటే మోక్షప్రదాయకము అని చెప్తారు. అయితే తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 12 దర్శనములు ఇచ్చే భగవానుడు ఈ శ్రీకృష్ణుడు. ఇంకా ఆ నందనందనుడికి జ్యోతుల తోరణాలతో జోతలర్పించే సుందరదృశ్యం ప్రతి భక్తుడిని అలరిస్తుంది. దక్షిణ ద్వారక అయినా ఈ ఆలయానికి ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన కృష్ణాష్టమి కి ఇక్కడ జరిగే ఉత్సవంలో కొన్ని లక్షలలో భక్తులు వచ్చి ఉత్సవంలో పాల్గొని ఆ చిన్ని కృష్ణుడిని దర్శనం చేసుకుంటారు.