ఈ ఆలయంలో వెలసిన మల్లికార్జున స్వామిని భక్తులు మల్లన్నగా ఆరాధిస్తారు. ఈ గ్రామంలోని యాదవులు మల్లన్న స్వామిని ఆరాధ్యదైవంగా భావిస్తారు. మరి మల్లికార్జునస్వామి కత్తెరశాల మల్లన్నగా పిలువబడే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో చెన్నూరు మండలం ఉంది. ఈ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కత్తెరశాల గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. మల్లికార్జునస్వామి కొలువుతీరిన కత్తెరశాల గ్రామానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులూ ఈ ఆలయాన్ని క్రీ.శ. 1600 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడే నారాయణపూర్ సరిహద్దున ఉన్న ఉత్తర వాహిన కోటి లింగాల వద్ద అగస్త్య మహాముని స్నానమాచరించి అక్కడ నుండి సొరంగ మార్గం ద్వారా కత్తెరశాల మల్లన్న ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించేవారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ గ్రామంలోని యాదవులు మల్లన్న స్వామిని తమ ఆరాధ్యదైవంగా భావించి పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు జాతర భక్తి శ్రద్దలతో జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో భక్తులు కొన్ని వేల సంఖ్యల్లో ఈ ఆలయానికి తరలివస్తారు. ఒగ్గు పూజారుల ఒగ్గు కథల పూజలు పతనాలతో మల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక చెన్నూర్ పరిసర ప్రాంతాల్లో ఉత్తర వాహినిగా పేరున్న గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి ఆ తరువాత మల్లన్న స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాడ నమ్మకం. ఈ ఆలయం ఎదురుగా ఉండే రావిచెట్టు క్రింద ఉండే నాగేంద్రుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంతానం లేని దంపతులకి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా కత్తెరశాల గ్రామంలో వెలసిన ఈ మల్లన్న స్వామిని దర్శించుకోవటానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.