మహాభారతం లో దుర్యోధనుడు అంటే అతి భయంకరుడు, నీచుడు , దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. మరి అలాంటి దుర్యోధనుడికి ఆలయం అనేది ఎందుకు నిర్మించారు. ఆయనని అక్కడి ప్రజలు దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము.
కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో మలనాడు అనే ప్రాంతంలో దుర్యోధనుడికి ఒక ఆలయం నిర్మించబడి ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక దుర్యోధనుని ఆలయంగా మలనాడు దేవాలయం విరాజిల్లుతోంది. అయితే మహాభారత కథ ఆధారంగా దుర్మార్గుడైన దుర్యోధనుడికి ఆలయాన్ని నిర్మించి దేవుడిగా పూజించడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మలయాళంలో మల అంటే చిన్న కొండ, నాడ అంటే దేవాలయం. చిన్న కొండపైన దేవాలయం అనేది ఉంది కనుకే ఈ ప్రాంతానికి మలనాడ అనే పేరు వచ్చినది. తరతరాలుగా ఇక్కడి భక్తులు తమ ఆయురారోగ్యాలని,పంట పొలాలను కాపాడే దేవుడిగా దుర్యోధనుణ్ణి నిత్య పూజలతో కొలుస్తుంటారు. కేరళ కళా సంస్కృతి, నిర్మాణ శైలిలో ఆలయ ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. ఆకాశమే పై కప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు, తళుకులీనే గొడుగులతో ఆలయం ఎంతో అందంగా అలంకరించి ఉంటుంది. ఈ ఆలయములోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది. దానిమీద ఎలాంటి అర్చామూర్తి లేడు. ఆ గద్దె దుర్యోధనుని సింహాసనంగా, దానిమీదే అయన ఆసీనులై ఉన్నారన్న భావనతో భక్తులు పూజిస్తారు. ఇది ఇలా ఉంటె స్థల పురాణం ప్రకారం, 12 ఏళ్ళ అరణ్యవాసం తరువాత పాండవులు చేసిన ఏడాది అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు, శకుని వేయని ఎత్తులు లేవు. మలనాడు ప్రాంతంలో నివసిస్తున్న సిద్దులకి ఏవో అధ్బుత శక్తులున్నాయని, ఆ రహస్యాలు తెలుసుకుంటే కురుక్షేత్రంలో విజయం సాదించవచ్చని దుర్యోధనునికి ఎవరో సలహా ఇచ్చారట. అప్పుడు అయన వెంటనే జిత్తులమారి మామ అయిన శకునిని వెంటబెట్టుకొని సిద్ధుల్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నాక అలసిపోయి ఇక్కడ సేదతీరుతుండగా వారిద్దరికీ అక్కడి స్థానికులైన కురువలు స్వాగతం పలికి చల్లటి కొబ్బరి కల్లుతో దాహం తీర్చారు. వారు అంటరానివారైనా సహృదయంతో అందించిన గౌరవమర్యాదలకు పొంగి పోయిన దుర్యోధనుడు ఆ ప్రాంతానికి వారినే పాలకులుగా నియమించి,వందలాది ఎకరాల సారవంతమైన భూముల్ని సైతం కట్టబెట్టాడట. అయితే ఇక్కడ ఉన్న సిద్దులు, పాండవులని జయించడానికి శివుడి కోసం తపస్సు చేయమని దుర్యోధనునికి సలహా ఇచ్చారట. ప్రస్తుతం ఆలయ గద్దె ఉన్న ప్రాంతంలోనే దుర్యోధనుడు తపస్సు చేసాడని కురువంశస్థుల ప్రగాఢ విశ్వసం. కురుక్షేత్రంలో దుర్యోధనుడు వీర మరణం పొందాడని ఆయనే ఇప్పటికి మాకు కులదైవంగా కొలుస్తున్నట్లు కురువ వంశస్థులు చెప్పుతున్నారు.
ఈ ఆలయంలో వేలన్ వంశస్థుల ఆధ్వర్యంలో 12 సంవంత్సరాలకు ఒకసారి 12 రోజుల పాటు పళ్ళిప్పన్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పూజలు చేయటం వల్లే ప్రజలకు, పంటపొలాలకు సోకిన నరదృష్టి,గ్రహదృష్టి,రాక్షసదృష్టి తొలగిపోతాయన్నది వారి విశ్వాసం.ఈ విధంగా దుర్యోధనుడు ఇక్కడి వారికీ కులదైవంగా మారి వారి చేత నిత్యం పూజలందుకుంటున్నాడు.