సరస్వతి దేవి కొలువై ఉన్న ఆలయాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే సరస్వతీదేవి కొలువై ఉన్న అరుదైన ఆలయాల్లో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఆ దేవి నిలబడి భక్తులకి దర్శనం ఇస్తుంటుంది. ఇలా సరస్వతి దేవి నిలబడి దర్శనం ఇచ్చే ఆలయం దేశంలో ఇది ఒక్కటి మాత్రమే అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, సిద్దిపేట లోని చిన్న కొండూరు మండలం, అనంత సాగరం అనే గ్రామంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి ఆలయం ఉంది. ఇక్కడ చుట్టూ ఎత్తైన గుట్టల మధ్య ఈ ఆలయం ఉంది. ఇక్కడ రమణీయమైన, ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆలయ పరిసరాలు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి.
ఇక ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, వీణధారి అయిన సరస్వతి దేవి నిలబడి ఉన్న విగ్రహం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇంకా ఇక్కడ దేవతామూర్తులు నిల్చునట్లుగా ఉన్న క్షేత్రాలు చాలా విశిష్టమైనవిగా వెలుగొందుచున్నాయి. ఈ ఆలయాలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని భక్తులలో గట్టి నమ్మకం. అందువలన స్థానికంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న అష్టావధాని అనే వ్యక్తి ఈ ప్రాంతంలో విద్య కుసుమాలు వికసించాలన్న సత్సంకల్పంతో నిలబడి ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని 1990 వ సంవత్సరంలో స్వతీమాత, సౌభాగ్యలక్ష్మి, మహంకాళి మాతల విగ్రహాలు ప్రతిష్టించారు.
ఈ ఆలయ ప్రాంతంలోనే గుహలో చిన్న చిన్న బావుల్లా ఉండే మూడు దోనెల్లో నీరు నిరంతరం ఊరుతుంటుంది. వీటిని భక్తులు విశిష్టమైన జలంగా భావిస్తారు. అయితే మాటలు రాని పిల్లలకు ఈ నీరు తాగిస్తే మాటలు రాగలవని చెబుతారు. అలాగే చర్మవ్యాధులు నయం అవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నీరు తెల్లగా తియ్యగా ఉంటుంది.
ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దసరా మరియు వసంతపంచమి రోజుల్లో ఈ క్షేత్రంలో సామూహిక అక్షరాబ్యాసలు జరుగుతాయి. అంతేకాకుండా చవితి, పంచమి, షష్టి రోజుల్లో మూడు రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.