భారతదేశ ప్రధానిగా నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరువాత దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి పి.వి. నరసింహారావు గారు. రాజీవ్ గాంధీ మరణం తరువాత రాజాకీయ సన్యాసం తీసుకుందాం అని భావించిన ఆయన్ని సోనియా గాంధీ గారు అప్పటి రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఊహించని విధంగా పార్టీకి దూరంగా వెళ్లిన ఆయన్ని ప్రధాన మంత్రిని చేసింది. ఇలా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక తెలుగు వాడు పి.వి. నరసింహారావు గారు. దేశం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పుడు అయన చేపట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు ఆ సంక్షోభం నుండి బయటపడేలా చేసాయి. ఆలోచన విధానంలో అపర చాణక్యుడు అని చెప్పే పి.వి. నరసింహారావు గారిని ఏ రాజకీయ పార్టీ వచ్చి ప్రధానిని చేసిందో అదే పార్టీ ఆయన్ని చివరకు గోరంగా అవమానించడమే కాకుండా కోర్టు చుట్టూ తిరిగి అయన ఆస్తులన్నీ అమ్ముకునేలా చేసాయి. అంతేకాకుండా పి.వి. నరసింహారావు గారు చనిపోతే ఆయనకి కనీస నివాళి అనేది కూడా ఇవ్వలేదు, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన నూతన సంస్కరణలు చేసి దేశాన్ని ఆర్థిక రంగంలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఆయనకి కీర్తిని రాజకీయ కుట్రకి బలిదీసాయి. మరి పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఎలా ఎదిగారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన్ని దూరం పెట్టాల్సి వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పి.వి. నరసింహారావు గారు 1921 వ సంవత్సరం జూన్ 28 న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గం లోని లక్నెపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు గారి దంపతులకి జన్మించారు. ఈయన బాల్యంలో కరీంనగర్ జిల్లా, భీమదేవర మండలం, వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన్ని పాములపర్తి వెంకటనరసింహరావు అని పిలిచేవారు.ఆ తరువాత 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. ఇలా చేయడంతో ఆయన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు. దాంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నా 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు. ఆ తరువాత1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. అయితే అయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్యాసాలు వ్రాసేవాడు. ఆ సమయంలో బహు భాషల్లో ప్రావిణ్యం సంపాదించారు.
అయితే 1952 వ సంవత్సరంలో కరీంనగర్ నుండి పోటీ చేసిన అయన బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తరువాత 1957 నుండి 1972 వరకు అయన వరసగా మంథాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1967 లో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసారు. ఇక 1971 వ సంవత్సరంలో అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇందిరాగాంధీ ప్రోత్సహం తో సిఎం గా ఎంపికయ్యారు. కానీ అప్పుడు జరుగుతున్న ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఈయన్ని పక్షపాతిగా చూసింది. కొందరు మంత్రులు పదవులకి రాజీనామా కూడా చేసారు. ఇక అప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయగా రాష్ట్రపతి పాలన రావడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే అయన ఆ పదవి నుండి తప్పుకోవాల్సివచ్చింది.
ఇక రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఇందిరాగాంధీ ఆయన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంలో అయన సేవలు వినియోగించుకోవాలని భావించి ఆయన్ని రాష్ట్ర రాజకీయాల నుండి అక్కడికి తీసుకెళ్లింది. అయితే ఇందిరాగాంధీ మరణం తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయినా అయన 1991 వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవగాంధీని హత్య చేసారు. ఈ ఘటన తరువాత అయన రాజకీయాలకు స్వస్తి చెప్పుతున్నట్లుగా ప్రకటించాడు. కానీ ఆ ఎన్నికల్లో సింపతీ కారణంగా కాంగ్రెస్ సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
ఆ సమయంలో కాంగ్రెస్ లో కొన్ని గ్రూపులు ఉండగా, ఎటువంటి గ్రూపులు లేని, స్వలాభం కోసం చూడకుండా, ఇందిరాగాంధీ కి, రాజీవగాంధికి కొంచెం సన్నిహితంగా ఉండే పి.వి. నరసింహారావు గారిని ప్రధాన మంత్రిని చేస్తే ఎటువంటి రాజకీయ ఇబ్బందులు రావని తలచి ఆయనకి కేంద్రం పిలిచి మరి ప్రధానమంత్రి పదవిని అప్పగించింది. ఇక ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయానికి దేశం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉంది, అప్పటికి మనదేశానికి మిగిలి ఉంది మూడు వారాలకి సరిపడా మాదకద్రవ్యమే. ఇక అది కూడా అయిపోతే దేశం అడుక్కునే పరిస్థితి, ఇలాంటి భయంకర పరిస్థితుల్లో అయన దేశ ప్రధానిగా పగ్గాలు అందుకున్నారు.
దేశంలో డబ్బు అనేది లేకపోతే పెట్టుబడుల రూపంలో తీసుకురావాలి అంతే కానీ అప్పుగా తీసుకు రాకూడదు అంటూ మన్మోహన్ సింగ్ ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి దేశంలో సంస్కరణలకు తెర తీసారు. అయన దాదాపుగా 47 రంగాల్లో 51 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. బ్యాంకులకు వడ్డీరేట్లలలో స్వేచ్చని ఇచ్చాడు. ఇక విదేశీ పెట్టుబడుల రాకతో పరిశ్రమలు పెరిగి దేశ ఉత్పత్తి అనేది పెరిగింది. ఇప్పుడు ఉన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ సంపద లక్షల కోట్లకి ఎదిగింది అంటే దానికి మూలకారణం పి.వి. నరసింహారావు గారు. ఇక పదేళ్లు అయన వివిధ శాఖలలో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించారు.
ప్రధానమంత్రిగా అయన చేసిన వాటిలో, వైద్య, విద్య శాఖలో మార్పులు తేవడం, కాశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడం, ఆగ్నేయాసియా దేశాలతో, చైనా, ఇరాన్ వంటి దేశాలతో మెరుగైన సంబంధాలు పెంచుకోవడం, ఇంకా వాజ్ పై ప్రభుత్వం హయాంలో చేపట్టిన పోక్రాన్ – 2 అణుపరీక్షలకు శ్రీకారం చుట్టింది కూడా పివి గారే అని ఇంకా అయన కాలంలోనే అణుబాంబు తయారయ్యందని స్వయంగా పార్లమెంట్ లో వాజ్ పై గారు చెప్పారు. ఇంకా 5 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తరువాత పివి గారికే దక్కింది. తనదైన ఆత్మవిశ్వాసంతో, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించిన ఆయన్ని అపర చాణుక్యుడు అని అంటారు.
అయితే ఆ సమయంలో అయన అనేక ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. 1994 వ సంవత్సరం ఆయన అవిశ్వాస తీర్మానాని ఎదుర్కొన్నారు. ఇంకా 1992 వ సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతలోనూ విమర్శలను ఎదుర్కొన్నారు. ఇంకా సెయింట్ కిట్స్ ఫోర్జరీ వంటి కేసులు అయన చివరి రోజుల వారికి వెంటాడాయి. అయితే ఆయన చనిపోయే ఒక సంవత్సరం ముందు అన్ని కేసుల నుండి బయటపడి ఎటువంటి మచ్చ లేని మనిషిగా అయన డిసెంబర్ 23 వ తేదీ 2004 వ సంవత్సరంలో మరణించారు.
ఒక దేశ ప్రధానిగా అయన ఎనలేని సేవలను అందిస్తే సొంత పార్టీ ఏ ఆయన్ని ఎందుకు దూరం పెట్టింది, ఎందుకు ఆయనకి లభించాల్సిన గౌరవం దక్కలేదనే ఎన్నో ప్రశ్నలకి హాఫ్ లయన్ అనే పుస్తకం జవాబు ఇచ్చింది. అయితే రోజు రోజుకి అతడి పాలన చూసి అసూయా చెంది అతడి పైన కుట్ర పన్ని సోనియాకు నెహ్రు కుటుంబానికి అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమెని నమ్మించారు. అదే సమయంలో బాబ్రీ మసీదు ఘట్టం అయన ప్రతిష్ఠితకు భంగం కలిగించింది. ఆ సమయంలో అయన నాయకత్వం మీద సోనియా తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే బాబ్రీ మసీదు అంశంలో అప్పటి బిజెపి నాయకుడు అద్వానీ ఆడిన డబుల్ గేమ్ కారణంగా పివి గారు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారని ఈ పుస్తకంలో ఉంది. ఇంకా పార్టీలో కొందరు వారి మనుగడ కోసం అన్నం పెట్టిన పార్టీకే ద్రోహం చేస్తున్నాడు అంటూ సోనియా దగ్గర విష ప్రచారం చేసారు. అప్పుడు ఉన్న ఆర్థిక సమస్యలని, జరుగుతున్న పరిణామాల మీద ద్రుష్టి పెట్టిన అయన సోనియాకు ఎలాంటి వివరణ ఇవ్వలేకపోయారు.
ఇలా ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ అయన పార్టీ వదిలి వెళ్ళలేదు, ఇక 1996 వ సంవత్సరం లో పివి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గోరంగా ఓడిపోయింది. ఆ తరువాత 1998 లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1999 వ సంవత్సరంలో పివి గారికి పార్టీ కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ అయన ఎవరి మీద ఎటువంటి ఆరోపణలు చేయకుండా వారి విజ్ఞతకే వదిలేసారు. అయితే అయన మరణిస్తే కనీస గౌరవంలేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా పెట్టినివ్వకుండా అంతక్రియలు హైదరాబాద్ లోనే చేయాలంటూ వారి కుటుంబం పైన ఒత్తిడి చేసారంటూ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఇంకా తన పైన ఉన్న కేసుల చుట్టూ తిరుగుతూ తన ఆస్థి అంతటిని కూడా అమ్ముకున్నారనే వాదన ఉంది.
భారతదేశ ఆర్థికవ్యవస్థని నిలబెట్టిన ఘనత సాధించినప్పటికీ ఆయనకి చరిత్రలో సరైన స్థానం లభించలేదు. ఎందుకంటే అయన ఖ్యాతిని రోజు రోజుకి ఎక్కడ ప్రపంచం గుర్తిస్తుందో ఆలా గుర్తిస్తే భారతదేశంలో గాంధీ కుటుంబం పేరు ఎక్కడ మరుగున పడుతుందో అని పివి గారు దేశానికి చేసిన సేవలను చరిత్రలోకి ఎక్కకుండా చేశారనే వాదన ఉంది.
పివి గారు ప్రధానిగా ఉన్నన్ని రోజుల గురించి ఇన్ సైడర్ పేరుతో ఆత్మకథని రాసుకున్నారు. దీనిని లోపలి మనిషి అని తెలుగులో కూడా అనువదించారు. ఆయనకి కళల పైన మక్కువ ఎక్కువ ఉండేది. అయితే విశ్వనాధ సత్యనారాయణ రాసిన వెయ్యి పడగలు అనే నవలను పివి గారు హిందీలోకి అనువదించారు. ఆ పుస్తకానికి పివి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఇంకా తాను చదువుతున్న రోజుల్లో చాలా పత్రికలకు ఆర్టికల్స్ రాసేవారు. అంతేకాకుండా కాకతీయుల వారసత్వానికి గుర్తింపు తెచ్చేందుకు ఏకంగా కాకతీయ పత్రిక స్థాపించారు.
ఒక మేధావి, రాజకీయాలలో అపర చాణక్యుడు, బహుభాషావేత్త, భారత చరిత్రలో ఒక మహోన్నతమైన అధ్యాయాన్ని సృష్టించిన వ్యక్తి ఒక తెలుగువాడు అయినందుకు పి.వి. నరసింహారావు గారికి జోహార్లు.