ప్రపంచ వ్యాప్తంగా శబరిమల పుణ్యక్షేత్రానికి మంచి ఆదరణ ఉంది. ఈ ఆలయంలో ఉన్న స్వామినే అయ్యప్ప గా కొలుస్తారు. అయ్యప్ప పేరులో అయ్యా అంటే ‘విష్ణువు’, అప్ప అంటే ‘శివుడు’ అని అర్ధం. అందుకే ఈ స్వామికి అయ్యప్ప అను పేరు వచ్చిందని చెబుతారు. ఇంకా ఈయనను హరిహరసుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇప్పటివరకు శబరిమలకు 10 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారికి ప్రవేశం అనేది లేదు. కానీ ఇటీవలే దీనిపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మరి సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? ఎందుకు శబరిమలకు ఆడవారికి ప్రవేశం ఉండేది కాదు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం ఉంది. శబరిమల వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి భక్తులు తప్పకుండ మాల ధరించి ఉండాలి. ఇక అయ్యప్ప దీక్ష ప్రారంభించిన భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యను పాటిస్తుండాలి. అయితే కార్తీక మాసం నుండి మాలధారణ ధరించి 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళుతుంటారు.
ఇక విషయంలోకి వెళితే, ఇప్పటివరకు కూడా శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ప్రవేశం అనేది నిషేధం. ఇలా నిషేధం ఉండటానికి కారణం అయ్యప్ప తన జీవితకాలం అంత కూడా బ్రహ్మచారిగా ఉన్నాడని రుతుస్రావం కారణంగా ఆ వయసు ఉన్న ఆడవారికి ఆలయ ప్రవేశం నిషేధం అనే వాదన ఉండేది. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది న్యాయవాదుల సంఘం 2006 లో సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసింది.
ఈవిధంగా కేవలం రుతుస్రావం కారణంగా నిషేధించడం రాజ్యాంగంలోని సెక్షన్- 14 ప్రకారం సమానత్వాన్ని నిషేదించడమే అవుతుందని వారు వాదించారు. వీటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన 12 సంవత్సరాల తరువాత ఆచారాలు, సంప్రదాయాలలో వివక్షనేది ఉండకూడదని, ఋతుచక్రం అనేది ఆడవారి గౌరవమని, దానికారణం వలన ఆలయ ప్రవేశం నిషేధించడం అంటరానితనం అవుతుందని, ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించాలంటూ ఇటీవలే సుప్రీంకోర్టు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
ఇక దీనిపైన అందరిలో భిన్నవాదనలు అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయంపైనా కొందరు ఏకీభవిస్తే, మరికొందరు దైవం విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకపోతే చాలా మంచిదంటూ హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ కొందరు భక్తులు మాత్రం మాకు శబరిమలలో మకరజ్యోతి చూసే భాగ్యం లభించిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.