శివుడు లింగరూపంలో వెలసిన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శివుడు ఐదు ముఖాలు గల నల్లని శివలింగం భక్తులకి దర్శమిస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది. శివుడు ఇలా దర్శనమిచ్చే చాలా అరుదైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ శివలింగం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో శ్రీ పంచముఖేశ్వర శివలింగ ఆలయం ఉంది. ఈ ఆలయంలో నాలుగున్నర అడుగుల ఎత్తు, మూడున్నర అడుగుల చుట్టుకొలత గల నల్లని శివలింగం ఉంది. ఈ నల్లని శివలింగానికి అగ్రభాగాన ఐదు ముఖాలు కలిగిన ఒక అపురూప శివలింగం ఉంది.
ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, ఆలయంలోని ప్రధాన శివలింగానికి పానవట్టం లేదు. అందుచేత గ్రామస్థులు స్థానికంగా దొరికే రాతినే పానవట్టంగా చెక్కించి, ప్రతిష్టించి పూజాదికాలను నిర్వహించారు. తరువాత జరిగిన కార్యక్రమాలలో భాగంగా ఆ ఆలయాన్ని పునర్నిర్మించి ఎత్తైన పానవట్టం మీద స్వామివారిని ప్రతిష్టించి, ఆనాడు లభించిన నాలుగు శివలింగాలను ఆలయానికి నాలుగు వైపులా ప్రతిష్టించారు.ఈ శివలింగ మూర్తి పాటిమన్ను త్రవ్వకాలలో 1937 ఈశ్వరనామ సంవత్సరం చైత్రశుద్ద పంచమి రోహిణి నక్షత్రం గురువారం ఉదయం 10 గంటలకి లభించిందని పెద్దలు చెబుతున్నారు. ఈ శివలింగం లభించిన ప్రాంతంలోనే మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా లభించాయి. అయితే తూర్పు వైపున ఉన్న స్వామివారిపై సంధ్యా కిరణాలూ పడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. పంచముఖేశ్వర స్వామికి కుడివైపున ఉన్న ఉపాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎడమ వైపున ఉన్న ఉపాలయంలో శ్రీ రాజేశ్వరీదేవి ప్రతిష్ఠితులై ఉన్నారు. ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు, కార్తీకమాసంలో దీపోత్సవం, మహాశివరాత్రికి కళ్యాణం చాలా గొప్పగా నిర్వహిస్తారు.