మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాలలో రహస్యాలు ఇప్పటికి అంతుచిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆలా మిస్టరీగా మిగిలిన ఆ ఆలయాలు ఏంటి? ఆ ఆలయాల్లో ఉన్న అద్భుత రహస్యం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జ్వాలాముఖి దేవాలయం:
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా నుండి దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే ఊరిలో ఈ జ్వాలాముఖి ఆలయం ఉంది. 51 శక్తిపీఠాలలో ఈ జ్వాలాముఖి ఒకటి. అమ్మవారు జ్వాలారూపంలో ఉండటం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ ఆలయంలో రెండు నుంచి 10 ఏళ్లలోపు కన్యాలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు. ఈవిధంగా కన్యలను పూజించడం వలన దారిద్య్రం తొలుగుతుందని, దుఃఖ, శత్రునాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రామేశ్వరం:
తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉండగా, రామసేతు సైన్యం ఇక్కడే ప్రారంభం అయిందని స్థలం పురాణం చెబుతుంది. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రం. రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. అయితే ఈ బావుల్లో నీరు అనేది ఎప్పుడు ఉండటం విశేషం. ఈ ఆలయం బయట నుంచి కొంతదూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.
పూరి జగన్నాథ ఆలయం:
ఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరీ జగన్నాథ దేవాలయం ఉంది. ఈ ఆలయం నీలాద్రి అనే పర్వతం పైన ఉంది. ఈ ఆలయం పై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎటు వైపు నుండి చూసినా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది. ఈ ఆలయంలోని వంటశాలలో చెక్కల నిప్పు మీద ఏడు మట్టి పాత్రలను ఒక దానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది. ఇంకా ఈ ఆలయ సింహ ద్వారంలోనికి ఒక అడుగు వేయ్యగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక్క అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది. సాధారణంగా సముద్రం మీద నుంచి భూమికి మీదకు గాలి వస్తుంది మరియు సాయంత్రం వేళలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఇక్కడ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
హాసనంబ ఆలయం :
కర్ణాటక రాష్ట్రం, హాసన్ అనే ప్రాంతంలో హాసనంబా ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 12 శతాబ్దంలో నిర్మించబడినదిగా చెబుతారు. ఈ ఆలయంలో హాసనంబా అనే దేవత పూజలను అందుకుంటుంది. అయితే ఈ ఆలయాన్ని దీపావళి రోజున మాత్రమే తెరిచి అమ్మవారికి పూజలు చేసి, దీపావళి అర్ధరాత్రి ఆలయాన్ని మూసివేస్తారు. ఇలా సంవత్సరం పాటు ఆలయాన్ని మూసివేసి మరల దీపావళి రోజు ఉదయాన్నే తెరుస్తారు. ఇక్కడ ఆశ్చర్యకర విశేషం ఏంటంటే, దీపావళి రోజు అర్ధరాత్రి గర్భగుడిలో అమ్మవారి ముందు వెలిగించిన అమ్మవారి దీపాలు మల్లి సంవత్సరం తరువాత దీపావళి రోజు తెరిచేంతవరకు వెలుగుతూనే ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే గర్భగుడిలో వెలిగించిన దీపాలలో పొసే నెయ్యి లేదా నూనె మూడు లేదా నాలుగు రోజులకి వెలగడానికి సహాయపడవచ్చు కానీ సంవత్సరం పాటు ఆ దీపాలు ఎలా వెలుగుతున్నాయనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టలేదు. ఇది ఆ క్షేత్రం యొక్క మహత్యం అని చెబుతారు.
శ్రీ దక్షిణముఖ నందితీర్థ కళ్యాణి క్షేత్రం:
కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో శ్రీ దక్షిణముఖ నందితీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అతిప్రాచీన శివాలయలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, నంది నుండి నీరు రాగ ఆ నీరు సరిగ్గా కింద ఉన్న శివలింగం మీద పడేలా ఆలయాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యమైందనేది ఇప్పటికి ఎవరికీ అర్థంకాని విషయం. ఈ ఆలయంలో నంది నుండి నీరు అనేది ఎల్లప్పుడూ వస్తూ శివలింగం మీద పడుతుండగా ఆ నీరు ఎక్కడినుండి వస్తుందనేది ఇప్పటివరకు ఎవరు కూడా రుజువు చేయలేకపోవడం విశేషం. ఇంకా కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు.
విరూపాక్ష దేవాలయం – హంపి:
కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లాలో, హంపి లో విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులూ నిర్మించారు. ఇక్కడే విఠలాలయం ఉంది. ఈ కట్టడం శిల్పకళా రీత్యా అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. అయితే గర్భాలయాన్ని అనుకోని 6 మండపాలు ఆలయ ప్రాగణంలో విడివిడిగా ఉన్నవి. ఇక్కడే సంగీత స్థంబాల మండపంలో 56 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలని మీటితే సప్తస్వరాలు సరిగమలు వినిపించడం ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంబాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాతిలో సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టిని విషయం.