శ్రీ మహావిష్ణువుని అనంతపద్మనాభుడు అని పిలుస్తుంటారు. అనంతపద్మనాభుడు అనగా నాభి యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. అయితే ఇక్కడ వెలసిన ఆలయం లో పాము ఆకారంలో ఐదు తలలతో అనంతపద్మనాభుడు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. ఇంకా ఈ ఆలయం ఒక్క రోజులో నిర్మించారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎవరు ఈ ఆలయాన్ని ఒక్క రోజులో నిర్మించారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, మంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కుడుపు అం గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెలసిన శ్రీ అనంతపద్మనాభుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అని అర్ధం. ఈ ఆలయంలో శ్రీ అనంతపద్మనాభుడు పాము ఆకృతిలో, ఐదు తలలతో ఉంటాడు. ఇక ఈ ఆలయం కేరళ పద్దతిలో ఎర్రని పెంకులతో ఆలయం పై కప్పు నిర్మించారు.
ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ఆదిపురాణంలోని బ్రహ్మ నారద సంవాదంలో ఉన్న వివరాల ప్రకారం, విష్ణు భక్తుడైన వీరబాహు ఒక రాజ్యానికి రాజు. అయితే తెలియని పరిస్థితిలో తన సొంత కుమార్తె తో సంబంధాన్ని పెట్టుకుంటాడు. అది తప్పు అని తెలిసాక పచ్చత్తపడతాడు. అప్పుడు ప్రాయశ్చిత్తంగా తన రెండు చేతులు నరికి వేసుకోగా విష్ణువు ప్రత్యేక్షమై మూడుపాముల దేవాలయ నిర్మాణాన్ని ఒకే ఒక్క రోజులో పూర్తి చేసి తన పాపాన్ని ప్రక్షాళనం చేసుకోమంటాడు.
అప్పుడు ఆ రాజు గుడిని నిర్మిస్తుండగా గుడి చివరి దశలో ఉన్నప్పుడు రాజు శత్రువులు కోడిలా కూసి తెల్లవారు అయిపోయినట్లు చేయగా అప్పుడు విష్ణువు ఇచ్చినా గడువు ముగిసిందని భ్రమింపచేస్తారు. అప్పుడు విష్ణువు ఇంకా ఉదయం అవ్వలేదనే నిజాన్ని తెలియచేయడంతో గుడిని సకాలంలో పూర్తి చేస్తాడు. అప్పుడు విష్ణవు ప్రసన్నుడై రాజుకి తిరిగి చేతులని ప్రసాదిస్తాడు. ఈవిధంగా ఆ వీరబాహుడు నిర్మించిన ఆ ఆలయమే ఈ కుడుపులోని ఆలయం.
ఇలా వెలసిన ఈ ఆలయంలో నాగపంచమి రోజున జరిగే ఉత్సవం చాలా కోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈ గ్రామస్థులు ఆవు పేడ, ఆవుపాలు ఉపయోగించి ఇంటి గోడలపైన పాముల చిత్రాలు గారు. ఇలా చేయడం వలన పాములు వారిని కాటువేయని వారి నమ్మకం. ఇంకా శ్రావణం ఐదవ రోజున నాగపంచమి సర్పోత్సవ వేడుకలలో ఎడ్లబండ్లని అలంకరించి, శివాలయం దగ్గరికి తీసుకు వెళ్లి పూజిస్తారు. అక్కడే జరిగే ఉత్సవంలో స్త్రీలు నేలపై రకరకాల పాముల ఆకృతుల్ని రంగవల్లులుగా తీర్చిదిద్దుతారు. ఇంకా బంకమట్టితో పాముల్ని తయారు చేసి వాటికీ పసుపు, నలుపు రంగులు వేసి అలంకరణకు పెడతారు. ఇక ఈ సమయంలో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.