సాయిబాబా అంటే మనిషి రూపం దాల్చిన ఒక దేవుడిగా ఆయనను భక్తులు నమ్ముతారు. ఈయన సాధువు కనుక హిందువులు శివుని అవతారంగా సాయిబాబాను కొలుస్తారు. అయితే సాయిబాబా సమాధి అనంతరం షిరిడి లో ఆయనకు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది ఇలా ఉంటె ఇక్కడ వెలసిన సాయిబాబా ఆలయంలో సిమెంట్ తో చేయబడిన ఐదున్నర అడుగుల ఎత్తు ఉండే సాయిబాబా విగ్రహం అనేది భక్తులకి దర్శనం ఇస్తుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా విజయవాడ కృష్ణలంకలోని భ్రమరాంబాపురంలో ఈ సాయిబాబా మందిరం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన మొట్టమొదటి సాయిబాబా మందిరం ఇదేనని చెబుతారు. ఇక్కడ సాయిబాబా విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ బాబా విగ్రహం సిమెంట్ తో చేయబడింది.
ఈ ఆలయ ప్రాంగణంలోనే థుని ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం సాయిబాబా కు పల్లకి సేవ జరుగుతుంది. ఇంకా గురుపూర్ణిమ రోజు బాబాకు అన్నాభిషేకం జరుగుతుంది. ఈ రోజున పేదలకి అన్నదానం కూడా జరుగుతుంది.
ఇక విజయదశమి రోజున బాబా సమాధిని అలంకరించి, బాబాకు అనేక దీపాలతో హారతిని సమర్పించి పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బాబాకు చందన అలంకారం కూడా జరుగుతుంది. నూతన ఆంగ్ల సంవత్సరాదినాడు అంటే డిసెంబర్ 31 వ రోజున సాయిబాబా ఆలయం రాత్రంతా భక్తుల కొరకు తెరిచే ఉంటుంది.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో సాయివ్రతము, సహస్ర జ్యోతిర్లింగార్చన ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా ఉగాది పర్వదినాన బాబాకు సహస్ర కళాభిషేకం జరుగుతుంది. ఈవిధంగా వెలసిన ఈ సాయిబాబా మందిరానికి ఎప్పుడు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.