హనుమంతుడు వెలిసిన దేవాలయాలలో ఈ ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇచట హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ప్రసిద్ధి చెందడమే కాకుండా నవావతార ఆంజనేయుడిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. మరి ఆ నవావతారాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా, ఒంగోలులోని ముంగమూరు రోడ్డులో శ్రీ పంచముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో నవావతార ఆంజనేయ విగ్రహాలను తీర్చిదిద్దారు. మన దేశంలో ఆంజనేయస్వామిని తొమ్మిది అవతారలతో ప్రతిష్టించిన క్షేత్రం ఇది ఒక్కేటేనని చెబుతారు. ఆంజనేయస్వామి భక్తులు తమ విరాళాలతో 1983 వ సంవత్సరం హనుమాన్ జయంతినాడు ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
ఈ ఆలయ ముందు భాగంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గర్భాలయంలో నల్లరాతితో మలచిన 10 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం సర్వాలంకారభూషితంగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయిదు ముఖాలు, పది బాహువులు, తిరునామం, మీసకట్టుతో గధను ధరించి ఉన్న స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. వానర, నారసింహ, గరుత్మంత, వరాహ, హయగ్రీవ ముఖాలతో స్వామి అలరారుతుంటాడు.
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు నవవిధ ఆంజనేయ మందిరాలు వరుస క్రమంలో ఉంటాయి. పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించిన భక్తులు ముందు నవవిధ ఆంజనేయ మందిరాలలో మొదటిదైన ప్రసన్నంజనేయ స్వామి వారి మందిరాన్ని దర్శించుకుంటారు. ప్రసన్నవదనంతో, అభయ హస్తంతో, గధను ధరించి, సుందరరూపంతో ఆంజనేయస్వామి భక్తులకు దర్శమిస్తాడు.
ఆ తరువాత వీరాంజనేయస్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఎడమభుజాన గధను ధరించి, మరోచేతిని నడుము మీద వేసుకొని ఉన్న స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఆతరువాత వింశతిభుజ హనుమంతుడిని దర్శించుకుంటారు. ఇరవై చేతులు ఉన్న ఈ స్వామి ఇరవై చేతులలోను ఆయుధాలతో దర్శనమిస్తాడు. ఈ స్వామిని బ్రహ్మదేవుడు ఉపాసించి అనేక వరాలు పొందాడని ప్రతీతి.
ఆ తరువాత అష్టాదశ భుజ మారుతిని భక్తులు దర్శించుకుంటారు. 18 చేతులలో ప్రతి చేతిలోనూ ఆయుధాలను ధరించిన విశ్వరూపధారిగా స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ తరువాతి ఆలయంలో సువర్చలాసమేత ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి తన ఎడమ తొడపై సువర్చలాదేవిని కూర్చొండబెట్టుకొని అభయముద్రాంకితుడై దర్శనమిస్తాడు. ఆ తరువాత ఆలయంలో ద్వత్రింశద్భుజ మారుతీ భక్తులకు దర్శనమిస్తాడు. 32 చేతులతో ప్రతి చేతిలోనూ ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. ఇక చివరగా వనారంకుర ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఇది స్వామివారి సహజరూపం. ఈ స్వామి ఆరాధనం సర్వశుభకరంగా భక్తులు నమ్ముతారు.
ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయస్వామిగా, నవావతార ఆంజనేయుడిగా వెలసిన ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.