Home Health దేశంలోకి మరో కొత్త కరోనా వేరియంట్‍

దేశంలోకి మరో కొత్త కరోనా వేరియంట్‍

0

కరోనా మహమ్మారి రోజుకో కొత్త రూపం దాల్చుతోంది. జన్యుమార్పిడి చెందుతూ వివిధ వేరియంట్‌లుగా పంజా విసురుతోంది. భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలకు విస్తరించింది. లక్షల మంది దాని బారిన పది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో కప్పా, ఆల్ఫా, డెల్టా ప్లస్ అంటూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేసాయి.

Another New Corona Eta Variant Into The Country‍ఇప్పుడు కొత్తగా మరో కరోనా వేరియంటు వెలుగుచూసింది. కరోనావైరస్ తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, శాస్త్రవేత్తలను ఆందోళనలకు గురిచేస్తోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన ‘ఈటా'(బీ.1.525) వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ వ్యాపిస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తించారు.

ఇండియాలో ఉన్న కరోనా వైరస్‌లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకునేందుకు ఇప్పుడు తరచుగా… జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు మార్పుల అధ్యయనం) చేస్తున్నారు. ఈ క్రమంలో… ఈ వేరియంట్ బయటపడింది. నిజానికి ఇటా వేరియంట్‌ ఇదేమీ కొత్త వేరియంట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2020లోనే వెలుగలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకూ పెద్దగా దీనిపై పరిశోధనలు జరగలేదు.

తొలిసారి బ్రిటన్, నైజీరియాలో ఈ రకం వేరియంట్ బయటపడింది. ఎక్కువ కేసులు నైజీరియాలో నమోదయ్యాయి. దీన్ని B.1.525 అని పిలుస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. E484K, F888L రెండు ఉత్పరివర్తనలు ఉన్న ‘ఈటా’ వేరియంట్‌ మిగతా వేరియంట్ల కన్నా భిన్నమని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ‘ఈటా’ వేరియంట్‌ ప్రస్తుతం భారత్‌తో సహా 23 దేశాలకు విస్తరించింది.

కర్ణాటకలోని మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. నాలుగు నెలల కిందట బాధితుడు దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి రావడం జరిగింది. కరోనా లక్షణాలు బయటపడటంతో నిర్ధారణ పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నాడు. జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపగా ఆ వ్యక్తిలో కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడింది. దాంతో అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. కాగా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొత్త కరోనా వైరస్ అప్పుడే దేశాలకు విస్తరిస్తోంది.

కాగా, డెల్టా వేరియంట్ రూపంలో దేశంలో కరోనా వైరస్ ముప్పు కొనసాగుతూనే ఉంది. చిన్నారుల్లో కూడా ఈ వేరియంటే ప్రధానంగా కనిపిస్తోంది. రెండో దశ వ్యాప్తి వేళ కర్ణాటకలో నిర్వహించిన జన్యువిశ్లేషణల ఆధారంగా నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ సోకిన పిల్లల్లో విలక్షణమైన వేరియంట్ ఏదీ లేదు.. డెల్టానే ప్రధానంగా కనిపిస్తోంది.

Exit mobile version