దక్షప్రజాపతి తలపెట్టిన యాగానికి వెళ్లిన పార్వతీదేవి అవమాన భారంతో ఆత్మహుతి చేసుకొని మరణించినప్పుడు శివుడు ప్రళయకారుడై దక్షప్రజాపతి ని సంహరించడానికి భైరవుడిని సృష్టించి అతడిని అతడిని, అతడి యాగాన్ని నాశనం చేస్తాడు. మరి వీరభద్రుడు ఇక్కడ ఎలా అవతరించాడు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, మెదక్ జిల్లా, జిన్నారం మండలం, బొంతపల్లి గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చాలా మహిమలు కల ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం దేశంలోనే అరుదైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ ఆలయంలోని మందిరంలో అద్దాల మండపం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం దక్షప్రజాపతి సంహారం తరువాత అతని అనుచరులు దండకారణ్యానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రదేశంలో ప్రజలు శివభక్తులై సుఖ సంపదలతో జీవించడం చూసి అది రుచించక దక్షుని అభిమానులు వారిని హింసించడం మొదలుపెట్టారు. ఆ హింసలు భరించలేక బోళాశంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు బోళాశంకరుడు వీరభద్రుడిగా అవతారం ధరించి ఆ రాక్షసులను సంహరించాడు. అప్పుడు వారంతా కూడా వీరబద్రుడిని ఇచటనే ఉండవలసిందిగా ప్రార్ధించగా భక్తుల కోరిక మేరకు అచటనే వెలిశారు. అప్పుడు భక్తులు ఆ ప్రదేశంలో పల్లెను నిర్మించి అక్కడే స్వామి వారి పేరున చెరువును తవ్వి వీరన్న చెరువుగా నామకరణం చేసారు. ఆ పల్లెను బొంతపల్లిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆవిధంగా వీరభద్రస్వామి వారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయ విషయానికి వస్తే, గర్భాలయంలో వీరభద్రస్వామి వారి విగ్రహం చాలా గంభీరంగా భక్తులకు దర్శనం ఇస్తూ చూపురులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. భద్రకాళి అమ్మవారిని స్వామి ఆలయానికి వెనుక గల ఆలయంలో మనం దర్శించవచ్చు. ఈ స్వామిని అగస్త్యుల వారే ప్రతిష్టించారని ప్రతీతి. కాకతీయుల కలం నాటికే ఉన్న ఇచటి ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఏమి తెలియరాలేదు. ఎందుకంటే ఈ ఆలయం లో ఎలాంటి శాసనాలు లేవు. ఇలా వెలసిన ఈ స్వామివారిని దర్శిస్తే ఎన్ని ఏళ్లుగా వాయిదా పడుతున్న పనులు త్వరగా పూర్తవుతాయని, సంతానం లేని దంపతులు ఉంజలసేవ నిర్వహిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం.