శివుడు స్వయంభు శివలింగముగా అనేక ఆలయాలలో వెలిసాడు. ప్రతి శివాలయానికి ఏది ఒక విశిష్టత అనేది ఉంటుంది. అలానే ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివలింగం అనేది పెరుగుతూ వస్తుంది. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది? ఆ శివలింగం ఏవిధంగా పెరుగుతుంది? ఇంకా అక్కడి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని కోదాడ అనే గ్రామంలో కామేశ్వరిసమేత శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం ఉంది. దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం గుండ్రంగా కాకుండా, రెండు పలకలుగా ఉండటం ఒక విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడి శివలింగం తెల్లగా 1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నుండి వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట కానీ ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
ఈ శివలింగానికి ఇంకో విశేషం ఏంటి అంటే శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ ప్రదేశముంది. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ ఉబుకుతుంది. అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా దీనిని చెబుతుంటారు. అందుకే ఇది స్వయంఅభిషేక లింగంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది. శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉంటుంది.అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు.
పురాణానికి వస్తే, కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. అయితే ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగం అని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పరివేసాడట కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట. అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు. ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇంకా శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు.
ఇలా ఇక్కడ స్వయంభూగా వెలసిన శివలింగం సంవత్సరానికి కొంచెం పెరగడమే కాకుండా నిత్యం స్వయం అభిషేకం జరుపుకుంటూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.