ప్రతి సంవత్సరం ఒక్క మహాశివరాత్రి రోజున మాత్రమే బాలయోగి స్వామివారు భక్తులకి దర్శనం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆయన ఎవరితోనే మాట్లాడారు. ఇక ఆ రోజు ముగియగానే మందిరానికి తాళాలు వేస్తారు. మరి ఈ మందిరం ఎక్కడ ఉంది? బాలయోగి స్వామివారు ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం గ్రామంలో బాలయోగి మందిరం ఉంది. ఇద్దరు బాలయోగీశ్వరులు ఈ మందిరంలోనే తపస్సు చేసారు. అయితే భగవాన్ పెద్ద బాలయోగి గారు 1930 లో జన్మించగా తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తపస్సు ని ప్రారంభించారు. భగవాన్ చిన్న బాలయోగి గారు తనకి 8 సంవత్సరాల వయసు ఉన్నపుడే 1950 లో తపస్సుని ప్రారంభించారు.
ఒకసారి బాలకృష్ణ అయ్యర్ గారు శ్రీ బాలయోగిని దర్శించి ఆయన తపోదీక్షను చూసి ఆయనకి భక్తునిగా మారి వారి కోసం ఒక మందిరాన్ని నిర్మించాడు. ఇక వారికీ తపోభంగం అవ్వకుండా మందిరానికి తాళాలు వేసి ఉంచేవారు. ఇలా మూసివేసిన మందిరాన్ని ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మాత్రమే ఆ తలుపులు తీయగా బాలయోగి గారు యోగ సమాధి స్థితిలో భక్తులకి దర్శనం ఇచ్చేవారు. కానీ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. మళ్ళి మరుసటి రోజు మందిరానికి తాళాలు వేసి ఇలా సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఆయన దర్శనం అనేది ఉండేది.
ఇలా ఈ స్వామివారు చాలా సంవత్సరాల పాటు లేవకుండా, ఎలాంటి ఆహారం తీసుకోకుండా అలానే తపస్సులోనే ఉండిపోయారు. ఇలా స్వామివారి గురించి రోజు రోజుకి భక్తులకి తెలియడంతో ఆయన్ని దైవంతో సమానంగా కొలిచేవారు. అయితే 1984 లో బాలయోగి గారి దర్శనం కోసం 5 లక్షలకి పైగా భక్తులు తరలివచ్చారట. ఈవిధంగా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే దర్శనం ఇచ్చే బాలయోగి గారు సమాధి చెందిన తరువాత ఇక్కడ శివరాత్రి చేయడం అనేది ఆగిపోయింది.
ఇలా సుమారు 40 సంవత్సరాల పాటు శ్రీ బాలయోగి స్వామివారి మందిరం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశంగా వెలుగొందినది.