ఆఫీసుకి వెళ్లే వారికైనా, ఇళ్లలో ఉండేవారికైనా చర్మం మొరటుగా, కాంతిహీనంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇక ఎండలో, పొల్యూషన్ లో బైటికి వెళ్లే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూడాల్సి వస్తుంది. అయితే కెమికల్స్ తో పాట్లు పడి చర్మాన్ని పాడు చేసుకునే బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఉపయోగించడం ఒక మంచి పరిష్కారం. చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లుగా అనిపిస్తే ద్రాక్ష పళ్లను కావాల్సిందే.
ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సూర్యుని కఠినమైన కిరణాల నుండి రక్షణను ఇస్తాయి. ఎండకు వెళ్లినప్పుడు ముఖం కమిలినట్లనిపిస్తే కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని వాటి రసాన్ని ముఖం పై సున్నితంగా మర్దన చేస్తే చాలు చర్మం తిరిగి నిగారింపు సంతరించుకుంటుంది. ఒక 20 వరకు ద్రాక్ష పండ్ల గుజ్జును తీసుకొని ముఖానికి రాస్తూ సుమారు 15-20 నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఇలా వీలున్నప్పుడల్లా చేస్తే చాలు…. ఇక ఏ బ్యూటీ క్రీమ్లు అవసరం లేదు. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్లరసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ద్రాక్షలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని టోన్ చేసి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. రసాయన యాంటీ ఏజింగ్ క్రీములకు బదులు ద్రాక్ష పళ్లను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. బ్యూటీ పార్లర్ లు పెద్దగా అందుబాటులో లేని కాలంలో అందగత్తెలు ఈ విధంగానే తమ అందాన్ని కాపాడుకునేవారట. పైగా శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆడవారికే కాదు మగవారి చర్మానికి కూడా ద్రాక్ష రసం చక్కగా పని చేస్తుంది.
అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ద్రాక్ష మేలు చేస్తుంది. వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి.
ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విలువలను కోల్పోవు. వీటిలోని పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి.