శేషతల్పంపై శయన ముద్రలో స్వామివారు భక్తులకి దర్సనమిచ్చే ఆలయం

0
2437

శ్రీమహావిష్ణువు మహర్షుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో బొలికొండ రంగనాథస్వామిగా వెలిశాడు. ఈ స్వామిని భక్తులు రంగ నాయకులు అని పిలుస్తుంటారు. ఈ ఆలయం లో శేషతల్పంపై శయన ముద్రలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Balikonda Ranganathswamy Kshetramఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణం నుండి గుత్తి పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో తొండపాడు అనే గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో బొలికొండ అనే చిన్న కొండపైన బొలికొండ శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది. స్వామివారు కొలువై ఉన్న ఈ కొండను శ్వేతగిరి అని పిలుస్తారు.

Balikonda Ranganathswamy Kshetramఇలా ఇక్కడ కొలువైన ఈ స్వామి ఏడుకొండల వెంకటరామానుని వలె, ఆపదమొక్కులవానిగా, వడ్డికాసులవానిగా కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా కీర్తిపొందాడు. అయితే తెల్లని రాళ్ళూ ఉన్నటువంటి కొండ కనుక ఇది శ్వేతగిరి అనే పేరుతో పిలువబడుతుంది. దీనికే మరొక పేరు బొలికొండ.

Balikonda Ranganathswamy Kshetramఇక పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు ఒకసారి భూలోక విహారం చేస్తూ ఈ ప్రాంతంలోని అరణ్యంలో సంచరించి ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ ఆ కొండపైన కొంతసేపు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇలా స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారనే విషయం తెలుసుకున్న మహర్షులందరు స్వామివారిని భక్తితో కొలిచారు. అప్పుడు మహర్షుల భక్తిని, దీక్షని మెచ్చుకున్నా శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకో అనగా అందుకు వారు, స్వామి ఈ భూలోకంలో ప్రజలు సంసార చక్రంలో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నారు. వారు కూడా మిమ్ములను దర్శించుకొని పూజలు చేసి ముక్తి పొందాలని మహర్షులు విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు మహర్షుల కోరిక మేరకు స్వామివారు ఇక్కడ బొలికొండ రంగనాథస్వామిగా కొలువుదీరినట్లు స్థల పురాణం.ఈవిధంగా వెలసిన అత్యంత మహిమాన్వితమైన ఈ స్వామిని వేలమంది భక్తులు దర్శించుకొని తరిస్తారు.