విశ్వామిత్రుడి యాగాన్ని తారక ప్రతిసారి పాడుచేస్తూ వచ్చింది. అయోధ్య నుండి రామ లక్ష్మణులను సిద్ధాశ్రమానికి పిలిపించాడు విశ్వామిత్రుడు. తారకను వధించిన తరువాత సుబాహు మారీచులను వెళ్లగొట్టారు రామ లక్ష్మణులు. అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. తిరిగి అయోధ్యకు వెళ్ళడానికి ఇంకా మాకు సెలవు ఇవ్వండి అని రాముడు అడిగాడు. జనకాపురిలో యాగం జరుగుతుంది ఆ యాగానికి నాతోపాటుగా రమ్మని ఆహ్వానించాడు విశ్వామిత్రుడు. సరేనని రామ లక్ష్మణులు కూడా బయలుదేరారు. విశ్వామిత్రుడు వనపాలకులతో, “నేను మిగిలిన మునులందరినీ వెంట బెట్టుకుని ఇప్పుడే బయలుదేరి గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను,” అని చెప్పి, సిద్దాశ్రమానికి మూడుసార్లు ప్రదక్షిణంచేసి తిరిగి వచ్చాడు.
తరవాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులై బయలుదేరారు. వారి వెనుక కొన్నివందల బండ్లమీద సమిధలూ, ఇంధనాలూ మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి. వారు పగలంతా చాలా దూరం నడిచి సాయంత్రం వేళకు శోణానదీ తీరాన్ని చేరుకున్నారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుని, “స్వామీ, ఎటువైపుచూసినా అందమైన వనాలుగల ఈ దేశం ఏదీ? దీని వృత్తాంతమేమిటి?” అని అడిగారు ఎంతో వినయంగా.
ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించీ, తన వంశం గురించీ ఇలా చెప్పాడు.”పూర్వం బ్రహ్మ కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమారైను పెళ్ళి చేసుకున్నాడు. ఆవిడకు నలుగురు కుమారులు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు.
ఆయన క్షత్రియధర్మాన్ని ఆచరించి తన నలుగురు కొడుకులనూ భూమిని పంచుకుని, న్యాయంగా ప్రజా పరిపాలన చేయాలనీ ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడి రాజధాని కౌశాంబి; కుశనాభుడి రాజధాని పేరు మహోదయం; ఆధూర్తరజసుడు ధర్మరణ్యమనే పట్టణన్ని రాజధాని చేసుకున్నాడు; వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు.
మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన అందమైన వనాలుగల దేశంలోనే. “ఈ దేశంచుట్టూ అయిదు అందమైన పర్వతాలున్నాయి. ఈ శోణానది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ, సస్యశ్యామలంగానూ చేస్తుంది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహీంచే నది.
కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడోకడని చెప్పాను కదా, ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ నూరుమంది ఆడ పిల్లలు కలిగారు. వారంతా చక్కని కన్యలు. ఒకనాడు ఆ నూరుమంది కన్యలు ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూండగా వాయుదేవుడు వారిని చూసి తనను పెళ్ళాడమని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనమూ, చావూ లేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి, తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప వేరేవారిని చేసుకోమన్నారు.
వాయుదేవుడికి కోపం వచ్చి వారందరిని మరుగుజ్జులుగా చేసేసాడు. అప్పుడా కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గిరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకున్నారు. “తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యం, వంశాభిమానం చూసి కుశనాభుడు ఎంతగానో సంతోషించాడు. వారిని ఇక పెళ్ళిలేకుండా ఉంచటం అంత క్షేమం కాదనుకుని, కాంపిల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్ళిచేసాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ళకు అందరికి పెళ్ళిచేసాక కుశనాభుడు కొడుకు కోసం పుత్రకామేష్టి యాగం చేసాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను.
నాకు సత్యవతి అనే అక్క ఉండేది. ఆమెను కౌశికి అని కూడా పిలిచేవారు. ఆమెను ఋచీకుడికిచ్చి పెళ్ళి చేసారు. ఆవిడ మహా పతివ్రత. మేము కుసుశికవంశం వాళ్ళం కాబట్టి మమ్మల్ని కౌశికులని కూడా అంటారు. మా అక్కపేరుతో కౌశికి అనేనది ఏర్పడింది. మా అక్కపైగల అభిమనం కొద్దీ నేను హిమవత్ ప్రాంతంలో కౌశికీ నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చాను. అని తన పుట్టుపూర్వతరాలు రామునికి చెప్పాడు.