బొబ్బిలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సుందరమైన ఆలయంలోని స్వామివారిని వారు వారి కులదైవంగా భావించేవారు. మరి ఇక్కడ వెలసిన స్వామివారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంకు 60 కి.మీ. దూరంలో బొబ్బిలి నగరం కలదు. ఇది తెలుగు వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు. బొబ్బిలి కోటకు సమీపంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం కలదు. సుమారు 200 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన పురాతన దేవాలయం. ఈ ఆలయం బొబ్బిలి రాజావారి ఆధ్వర్యంలో నిర్మాణం కావింపబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ వేణుగోపాలస్వామి బొబ్బిలి సంస్థానాధిపతుల కుల దైవం. వారు ఈ ఆలయాన్ని నిర్మించి, ఐదు అంతస్థుల గాలిగోపురం కూడా నిర్మించారని ప్రతీతి.
తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా, రెండు ప్రాకారాలతో ఉన్నది. ఆలయ గాలిగోపురం తూర్పు అభిముఖంగా ఉండి, దానిక్రింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. ప్రవేశద్వారం బయట కల్యాణమండపం ఒకటి ఉంది. మొదటి ప్రకారం నందు ధ్వజస్తంభం, గరుడాళ్వారు, మండపం, రెండవ ప్రకారం నందు ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి.
గర్బాలయం నందు రుక్మిణి – సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు కొలువై ఉన్నారు. గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉన్నది. గర్బాలయంనకు వాయువ్యం వైపున ఆండాళ్, నైరుతి వైపున శ్రీరామ క్రతః స్థంభం కలదు. ప్రధాన ఆలయం చుట్టూ గల మండపమునందు శ్రీ అంజనేయస్వామి, ఆళ్వార్లు, శ్రీ సీతారాములు, శ్రీ రామానుజులవారు, శ్రీ రాధాకృష్ణులు మానవలా మహామునులు మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశికి స్వామివారి కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇంకా ధనుర్మాసం కృష్ణజయంతి నందు విశేష పూజలు, ప్రత్యేక వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.