భారతదేశం భిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకే కాదు, ఆచారాలకు ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి చెందింది. మన దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వంటకం ఫేమస్. కానీ చాలా వరకు ఉత్తరాది వారు ఆహారంగా ఎక్కువగా గోధుమలతో చేసిన రొట్టెలను తింటే దక్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువగా తింటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇతర వేరే రకాలకు చెందిన ఆహార పదార్థాలను తింటారు.
గోధుమలలో పిండిపదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. గోధుమ రొట్టెలు తినేవారిలో విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నివారితమవుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు నివారితమవుతాయి. స్థూలకాయం కూడా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వరికి బదులు గోధుమ ఉపయోగిస్తుంటారు.
ఈ రోజుల్లో డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలామంది రాత్రిపూట అన్నం మానేసి కేవలం గోధుమ రొట్టెలు తింటుండటం మనకు తెలిసిన విషయమే. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె… ఈ రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. అంటే ఏది తిన్నా పర్లేదు. కానీ అన్నం తినే సమయంలో కూర చాలా రుచిగా ఉంటే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. కానీ రొట్టెలు తింటున్నామనుకోండి. ఎన్ని తింటున్నామో తెలుస్తుంది.అందుకే పరిమితి మించదు. దాంతో రక్తంలో గ్లూకోజ్ పెరగదు.
అందుకే అన్నం తినటం వలన లావుగా అవుతున్నాం అని బాధ పడే వారు, డయాబెటిస్ ఉన్నవారు కాస్త అన్నం రెండు రొట్టెలు కలిపి తినటం అలవాటు చేసుకుంటారు. చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ తరువాత అన్నం తింటారు. కాని అది మంచి పద్దతి కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అలా గోధుమ రొట్టెలను, అన్నాన్ని కలిపి అలా ఒకేసారి తినకూడదట. షాకింగ్‌గా ఉన్న ఇది నిజమే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం లో కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువ మరియు గోధుమ రొట్టెలలో కార్బోహైడ్రేట్స్ తో పాటుగా ఫైబర్ , గ్లూటెన్ అనే ప్రోటీన్ కూడా ఉంటాయి. అన్నం తొందరగా జీర్ణం అవుతుంది కానీ రొట్టె అలా కాదు.
గోధుమ రొట్టెల్లో కార్బొహైడ్రేట్స్‌తోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో రొట్టెలు నెమ్మదిగా అరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రొట్టెలకు ప్రాధాన్యతనిస్తారు. అయితే రొట్టెలు, అన్నం మాత్రం ఒకేసారి తినరాదు. గోధుమ రొట్టెల్లో ఉన్న గ్లూటెన్ ప్రోటీన్ వలన జీర్ణాశయ సమస్య మొదలవుతుంది. గ్లూటెన్ అనగా గ్లూ అంటే జిగురు పదార్థం. ఈ గ్లూటెన్ వల్లనే గోధుమ పిండి నీటితో తడిపినప్పుడు ముద్దలా తయారు అవుతుంది. ఇలాంటి పదార్థం అరగాలంటే కాస్త సమయం పడుతుంది.
ఈ రెండింటికీ జీర్ణం అయ్యేందుకు వేర్వేరుగా సమయం పడుతుంది. అన్నం త్వరగా జీర్ణమైతే రొట్టెలు త్వరగా కావు. ఫైబర్ ఉండడం వల్ల ఆలస్యమవుతుంది. దీంతో రెండింటికీ పొత్తు కుదరదు. కాబట్టి అన్నం, రొట్టె కలిపి తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కడుపు నొప్పి, అసిడిటీ, గ్యాస్, లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక ఎవరైనా ఈ రెండింటినీ కలిపి తినరాదు. దేన్నో ఒక దాన్నే ఆహారంగా తినాలి. అలా కలిపి తినాల్సి వస్తే కనీసం 2 గంటల వరకు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు అంటున్నారు. దీంతో జీర్ణ సమస్యలు రావట. జీర్ణాశయానికి ఎలాంటి ఇబ్బంది కలగదట.