ఒక 10-15 ఏళ్ల క్రితం గుండె జబ్బులు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారింది. ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి బాగా పెరిగింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఉరుకులు, పరుగులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ రకమైన జీవనశైలి యువ గుండెలకు చిచ్చుపెడుతోంది. 30 నుంచి 35 ఏళ్లకే గుండె జబ్బులు వస్తున్నాయి.
అస్తవ్యస్తమైన జీవనశైలికి తోడు వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చొని పని చేయటం, పొగ తాగటం, జంక్‌ఫుడ్స్, హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ గుండెపోటు రావడానికి దారి తీస్తాయి. ఇప్పుడు అందరు ఎక్కువ సమయాన్ని స్క్రీన్స్ ముందు గడుపుతున్నారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. ఇక విద్యార్థులయితే ఒత్తిడి తట్టుకోలేక డ్రగ్స్ వంటి వాటికి బానిసలవుతున్నారు. ఈ కారణాల వలన కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది.
అసలు ఎందుకు యువ వయసులో ఉండే వాళ్ళు గుండెపోటుతో బాధపడుతున్నారు…? గుండె పోటు ఎందుకు వస్తుంది..?, దానికి గల కారణాలు ఏమిటి..? అని పరిశీలిస్తే పెద్దవారిలోనైనా, యుక్త వయసులోనైనా గుండెనొప్పి రావడానికి కారణాలు అందరికీ ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై సరైన నియంత్రణ, శారీరక వ్యాయామం లేకపోవడం, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు.
ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తుంది. యుక్త వయసులో వచ్చే గుండెపోటుతో వచ్చే చిక్కేంటంటే దానికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం. చాలాసార్లు నిశ్శబ్దంగా విరుచుకుపడి అది ప్రాణాల మీదకు తెస్తుంది.
మన శరీరంలోని అన్నీ భాగాల నుండి రక్తం శుద్ధి చేయడానికి గుండెకు పంపబడుతుంది. అయితే ఒక్కోసారి హఠాత్తుగా గుండెకి రక్తం సప్లై అవ్వడం తగ్గిపోతుంది లేదా మొత్తానికి గుండె వరకు చేరుకోదు. దీని కారణంగా హఠాత్తుగా గుండెపోటు వస్తుంది. దీనివల్లే హృదయ సంబంధిత సమస్యలు యుక్త వయస్సు లో ఉండే వాళ్ళకి ఎక్కువైపోయాయి.
అందుకే యుక్త వయస్కులు అందరూ కూడా 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని డాక్టర్లు సలహాలిస్తున్నారు. వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం ఇలా మంచి జీవన విధానాన్ని పాటించాలి. దీనితో అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండచ్చు.