Some Interesting Yet Unknown Facts About Chilkoor Balaji’s Chief Priest Rangarajan

వేంకటేశ్వరస్వామి బాలాజీ గా పూజలందుకొంటున్న చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ వడ్డీ కాసులవాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డికాసులు ఏ మాత్రం ఆశించడు. ఇక్కడ పేద, ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఇది ఇలా ఉంటె ఈ ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షణలు చేసే భక్తులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో మాట్లాడుతూ భక్తుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ అందరిని ఆకర్షించే ఆ ఆలయ పూజారి పేరు రంగరాజన్‌. అయితే ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవ తో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించిన అయన బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ చేసి 1999 లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బాలాజీ టెంపుల్ పూజారిగా ఎందుకు అయ్యాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Chilkoor Balaji Temple

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు 23 కి.మీ. దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తుంటారు. ఇక ఈ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌ గారి నాన్న గారు సౌందర్‌రాజన్‌ తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే ఉన్నత చదువులు చదివారు. కామర్స్‌ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగారు.

రంగరాజన్‌ గారి చదువు అంత కూడా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే జరిగింది. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాడు. టీచర్లు అయన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. ఆయన స్కూల్ కి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్లే వాడు. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ కూడా ఆయనని ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే అయన వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్తారు.

చిన్నప్పటి నుంచీ వైద్యరంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో ఆయనకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ తీసుకున్నారు. చివరి ఏడాది థీసిస్‌ కోసం ఆయన ఇంకా నరేంద్రబాబూ అనే అతని సహాధ్యాయీ కలిసి అతి తక్కువ ఖర్చుతో తయారుచేయగల సిరంజీ ఇన్‌ఫ్యూషన్‌ పంప్‌ నమూనాని కనిపెట్టారు.

Chilkoor Balaji Temple

ఇక డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీస్థాయిలో తయారుచేయాలనే కలతో నరేంద్రతో కలిసి ఎన్‌ఆర్‌ బయోమెడికల్స్‌ అనే కంపెనీ స్థాపించారు. ఆ తరువాత వారి మధ్య మనస్పర్థలు వచ్చి తగవులు పడి విడిపోవడం ఇష్టం లేక కంపెనీని అతడినే చూసుకో అని చెప్పి అయన బయటకొచ్చేశారు. అప్పుడే వైద్య పరికరాలు తయారుచేసే మెడ్‌ ట్రానిక్స్‌ సంస్థ ఆయనకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది.

చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ ఆయనను పీడిస్తూనే ఉండేది. ఆలా ఆరేళ్లు గడిచాక ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పడంతో ఆయనకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచి దక్షిణాది మొత్తానికి ఆయనను హెడ్‌గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి పదిలక్షల రూపాయల జీతం ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటుండగానే ఓ సంక్షోభం ఆయన్ని కుదిపేసింది.

హైదరాబాద్‌ నగరానికి తాగు నీళ్లిచ్చే ఉస్మాన్‌ సాగర్‌ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. అప్పుడు ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవచేయడానికి తన శిష్యుణ్ణీ, అతని కుటుంబాన్నీ ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే వీరి పూర్వీకుడంటారు. తర్వాతి కాలంలో ఔరంగజేబు ఆక్రమణకీ, రజాకార్ల దాడులకీ ఎదురొడ్డి ఈ ఆలయాన్ని వారు కాపాడుకున్నారు. ఇప్పటికీ ఆ దేవుణ్ణి వారి ఇంటి పెద్ద కొడుకుగానే వీరు భావిస్తుంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ వీరిని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంది.

Chilkoor Balaji Temple

అప్పుడు వీరి నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీం కోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది. చిలుకూరు గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది! అప్పుడు వీరి నాన్న గారు మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు.

అప్పుడు ఒక అధికారి వీరి నాన్న గారితో, సౌందర్‌రాజన్‌ గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ ఆరాటం అన్నారు. ఆ మాటలు రంగరాజన్‌ గారికి ఓ కొరడాలా తాకాయి. ఆ క్షణమే నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని అయన నిర్ణయించుకున్నారు.Chilkoor Balaji Temple

అప్పుడు ఆయనకు 35 ఏళ్లు. మెడ్‌ట్రానిక్స్‌ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికీ హెడ్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అంత భవిష్యత్తున్న ఆయన ఇలా అర్చకవృత్తిలోకి రావాలనుకోవడం వారి నాన్న గారికి అస్సలు ఇష్టం లేక ఎవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడు రంగరాజన్‌ గారు కూడా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత రెండు నెలల తర్వాత వాళ్ళని ఎలానో ఆలా ఒప్పించారు. ఇక రంగరాజన్‌ గారి ఆఫీసులో అయితే ఈ విషయాన్ని ఎవరు కూడా నమ్మలేకపోయారు. ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా అని నవ్వారు. ఎవరు ఏమనుకున్నా అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నారు.

ఇలా అర్చకుడిగా మారిన తొలిరోజుల్లోనే వారి నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించారు. ఇంకా వీఐపీ దర్శనాలూ, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించారు. ఇప్పటికీ అందరూ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి చిలుకూరు బాలాజీ ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేసారు. అప్పటి దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు ఎంతో నష్టపోయాయి అని అందుకే ఆ చట్టంపై అన్నిరకాలా అయన పోరాడుతున్నార.

1990లకి ముందు చిలుకూరు ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! కానీ ఇప్పుడు వారాంతాల్లో నలభైవేల మంది దాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నారు. ఇవన్నీ కూడా అయన నమ్మే సనాతన ధర్మమనే చట్రంలోనే ఉండాలనుకున్నారు. సనాతన ధర్మమంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే అయన చెబుతారు. ఇక వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాల సారం అదేనని ఆయన నమ్ముతారు. అందుకే అయన వంతుగా ఇక్కడున్న సమస్యలూ, రుగ్మతలూ తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నారు.

Chilkoor Balaji Temple

ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరారు. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని కన్యావందనం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అమ్మాయిల గొప్పతనం చాటేలా మహలక్ష్మీ పూజ అనీ చేస్తున్నారు. ఆరోజు పెళ్లికాని అమ్మాయిలకి కొత్త బట్టలు పెట్టి కాళ్లకి పారాణి రాస్తారు. వీటన్నింటి ద్వారా గుర్తింపు పెరిగి టీవీలో ఏ చర్చాకార్యక్రమాలు చేస్తున్నా ఆయనని పిలవడం మొదలుపెట్టారు.

ఆయన మాటలు టీవీల్లో ప్రసారం కాగానే మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు. అవినీతిపరులు. మీవల్లే దళితులపైన వివక్ష అంటూ కుప్పలు తెప్పలుగా లేఖలు వచ్చేవి. ఎవరో కొందరివల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా? ఈ మథనం ఆయనలో చాలారోజులుగా ఉండేది.

గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజకని పిలిస్తే వెళ్ళినపుడు కార్యక్రమం తర్వాత అయన దగ్గరకి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి స్వామీ! ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి! అన్నాడు. అప్పుడు అయన కోపంతో వణికిపోయి గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేసారు. అప్పుడే ఓ దళిత సంఘం ఆయన్ని సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. అప్పుడు అయన దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పారు.

Chilkoor Balaji Temple

అప్పుడో సభ్యుడు లేచి మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా! అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసి తీరతానని చెప్పి అలా ఏప్రిల్‌ 17న బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లారు. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. అప్పుడు నోబెల్‌ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన రోజుని అయన ఎప్పటికి మరచిపోలేను అని చెబుతారు. దలైలామా తో మాట్లాడిన కొద్దిసేపటికే ఆయన ఒక పెద్ద సందేశం పంపారు. మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు అంటూ సాగిందా లేఖ. ఇది ఆయనకి ఎంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లోకంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నారు.

Chilkoor Balaji Temple

ఇది జరిగాక ఒకసారి తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడో ముసలాయన తచ్చాడుతూ వచ్చి మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబూ అంటూ వచ్చి ముద్దుపెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు! బొటబొటా కన్నీళ్లొచ్చేశాయ్‌ అని అయన చెప్పారు.

రంగరాజన్‌ గారి వ్యక్తిగత విషయానికి వస్తే, రంగరాజన్‌ గారిది ప్రేమ వివాహం. అయన భార్య పేరు సుధ. రంగరాజన్‌ గారు ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అహోబిల మఠంలో ఆమెని మొదటి సారి చూసినప్పుడే ప్రేమలో పడ్డారు. ఆమె అక్కడ నృసింహప్రియ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. అయితే ఆ పత్రికకి ఫల్గుణ పేరుతో కథలూ, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఇంజినీరింగ్‌ ముగించాక ఇంట్లో విషయం చెప్పి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చారు. ప్రస్తుతం వారి పెద్దబ్బాయి సీఏ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఇక తన అర్దాంగి అంగీకారంతోనే, అయన ఇద్దరి పిల్లల్లో ఒకర్ని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నని అయన తెలియచేసారు.

Chilkoor Balaji Temple

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్ని చిలుకూరు బాలాజీకి అంకితం చేసిన రంగరాజన్‌ గారి సేవాతత్వం, భక్తిభావం అనిర్వచనీయం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR